చిన్న బాధ కలిగితే చాలు మనలో చాలా మంది డిప్రెషన్ కి లోనౌతారు. సోషల్ మీడీయాలో ఫోటోలకు లైకులు రాలేదని.. కామెంట్స్ చెత్తగా పెట్టారని ఫీలయ్యే వారు కూడా ఉన్నారు. పరీక్షలో ఫెయిల్ అయ్యామనో.. ఇంకేదో కారణంతో ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఉన్నారు. అలాంటి వారందరూ ఈ చిన్నారి వీడియో చూసి కొద్దిగైనా మార్పు తెచ్చుకోవాలి. ఆ చిన్నారి చిన్న ఆనందం... ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... అఫ్గనిస్తాన్‌.. తాలిబన్లకు, సాయుధబలగాలకు మధ్య నలిగిపోతున్న దేశం. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతుందో తెలీక ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటారు. నిత్యం ఏదో చోట మారణహోమం జరుగుతూనే ఉంటుంది.  అలా జరిగిన ఓ దాడిలో ఓ  చిన్నారి తన కాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఆ చిన్నారికి ఇటీవల కృత్రిమ కారు అమర్చారు. అంతే..  ఆ చిన్నారి ఆనందానికి అవదులు లేవు. ఆనందంతో ఆ కృత్రిమ కాలుతోనే డ్యాన్స్ చేశాడు.  రోయా ముసావి అనే ట్విటర్‌ యూజర్‌ అహ్మద్‌ డ్యాన్స్‌ చేస్తోన్న వీడియోని షేర్‌ చేశారు. ‘కృత్రిమ కాలు అమర్చగానే తన సంతోషాన్ని ఇలా డ్యాన్స్‌ ద్వారా తెలియజేశాడు. చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదం ఇతని జీవితాన్ని మార్చడమే కాక ఎల్లప్పుడు నవ్వుతూ ఉండటం ఎలానో నేర్పించిందం’టూ ట్వీట్‌ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.