భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వేగం పెంచింది. శుక్రవారం రావల్పిండి నుంచి ఇస్లామాబాద్‌కు ఆయనను తరలించారు.

అనంతరం అక్కడ భారత హైకమిషనర్‌కు అభినందన్‌ను అప్పగించారు. మధ్యాహ్నం వాఘా బోర్డర్ వద్ద వర్ధమాన్‌ను భారత ప్రభుత్వానికి పాక్ అధికారులు అప్పగించనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు త్రివిధ దళాలు, దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో వాఘా సరిహద్దుకు చేరుకున్నారు.

భారత సైనిక స్ధావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడంతో వాటిని తిప్పికొట్టేందుకు మిగ్ 21 యుద్ధ విమానంలో అభినందన్ వెళ్లారు. అయితే అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూలిపోవడంతో... పాకిస్తాన్ సైన్యం అభినందన్‌ను అదుపులోకి తీసుకుంది.

జెనీవా ఒప్పందం ప్రకారం యుద్ధ ఖైదీలను బేషరతుగా స్వదేశానికి పంపాలని భారత్‌తో పాటు అంతర్జాతీయ దేశాలు పాక్‌పై ఒత్తిడి తీసుకురావడంతో అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.