ఇండోనేషియాలో ప్రధానికి ఘన స్వాగతం.. వందేమాతరం, మోడీ నినాదాలతో.. షేక్ హ్యాండ్స్ ఇచ్చేందుకు ఎగబడ్డ జనం..
20వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు, 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియాకు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అలాగే రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులు ప్రధానికి సాదర స్వాగతం తెలిపారు.

18వ తూర్పు ఆసియా సదస్సు, 20వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియాకు వెళ్లారు. ఆ దేశ రాజధాని జకార్తా చేరుకున్న ప్రధానికి అక్కడి భారతీయ సమాజం ఘనస్వాగతం పలికింది. అక్కడి రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ‘వందేమాతరం’, ‘మోడీ- మోడీ’ నినాదాలు చేస్తూ.. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అక్కడి ప్రవాస భారతీయులు ఎగబడ్డారు. వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, వారికి షేక్ హ్యాండ్స్ ఇస్తూ ప్రధాని ముందుకు సాగారు.
అక్కడికి ప్రధాని వచ్చిన సందర్భంగా భారత ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మోడీ- మోడీ, వందేమాతరం, ‘హుమారా నేతా కైసా హో, నరేంద్ర మోడీజీ జైసా హో’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. (మనకు ఎలాంటి నాయకుడు ఉండాలి? మోదీజీలా ఉండాలి) ’హర్ హర్ మోడీ, హర్ ఘర్ మోదీ’ అంటూ నినదించారు.
ఈ సందర్భంగా అక్కడికి తమ తల్లిదండ్రులతో వచ్చిన పిల్లతో సహా భారతీయ కమ్యూనిటీ సభ్యులతో ప్రధాని మోడీ సంభాషించారు. వారితో సెల్ఫీలకు ఫోజులిచ్చారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ఈ భేటీని మరపురాని స్వాగతంగా అభివర్ణించారు.
అంతకు ముందు కూడా జకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది. ఆయనకు అక్కడి మహిళా సాధికారత, బాలల రక్షణ శాఖ మంత్రి ఐ.గుస్తీ అయు బింటాంగ్ ధర్మావతి స్వాగతం పలికారు. ఇండోనేషియా సాంస్కృతిక నృత్యాన్ని కూడా ప్రదర్శించారు. బుధవారం ఇండోనేషియాకు బయలుదేరే ముందు ‘‘ప్రపంచ సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి, ఆచరణాత్మక సహకార చర్యలపై ఇతర నాయకులతో అభిప్రాయాలను పంచుకోవడానికి ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాని మోడీ ఒక ప్రకటనలో తెలిపారు.