Asianet News TeluguAsianet News Telugu

విచిత్రమైన జూ ఇదీ.. జంతువులు బయట సంచరిస్తే.. బోనులో మనుషులు

చైనాలో ఓ వింత జూ ఉన్నది. అక్కడ జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తుంటే.. మనుషులు మాత్రం బోనులో ఉండి వాటిని చూడాల్సి ఉంటుంది. ఈ జూకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

a unique zoo in china humans imprisoned in cages while animals roam free
Author
First Published Aug 23, 2022, 6:59 PM IST

న్యూఢిల్లీ: మనం ఏ జూకు వెళ్లినా అక్కడ క్రూర జంతువులు సహా మరెన్నో జీవులు బోనులో దర్శనమిస్తాయి. నిర్బంధంలో ఉన్న ఆ జంతువులను చూసి వీక్షకులు సంతోషిస్తుంటారు. ఒక్కసారి వాటిని అడవి నుంచి తెచ్చి బోనులో బంధించగా.. అప్పటి నుంచి అవి వాటి స్వేచ్ఛ జీవితాలను కోల్పోతాయి. కేవలం ఆ బోనులోనే తచ్చాడుతూ చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నట్టు ఉంటాయి. కొన్ని సార్లు శక్తివంతమైన జంతువులు కూడా దీనంగా మనల్ని చూసినప్పుడు మనసు చివుక్కుమనక మానదు. ఇదంతా మనం ఎప్పుడూ చూసే జూల గురించి. కానీ, చైనాలో ఒక విచిత్ర జూ ఉన్నది. అందులో జంతువులు బయట స్వేచ్ఛగా విహరిస్తుంటే వాటిని వీక్షించడానికి వెళ్లే మనుషులు మాత్రమే బోనులోకి వెళ్లి చూడాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉంది కదూ. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి..

జూ అంటే మనం చూసే వాటికి పూర్తిగా భిన్నంగా చైనాలో ఏర్పాటు చేశారు. చోంగ్‌కింగ్ అనే నగరంలో లేహెలెడు వైల్డ్ లైఫ్ జూలో జంతువులు స్వేచ్ఛగా విహరిస్తుంటే మనుషులు మాత్రం వాటిని బోనులో వెళ్లి తిలకించి వస్తుంటారు.

జూ పర్యాటకులు లాక్ చేసిన బోనులోకి వెళతారు. ఆ క్రూర మృగాలు బోనుకు సమీపంగా వస్తుంటాయి. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఆ బోను చుట్టూ తిరుగాడుతుంటాయి. అయితే, ఆ జంతువులను బోను వైపు ఆకర్షించడానికి జూ నిర్వాహకులు సాహసోపేతమైన ఐడియాను అమల్లో పెట్టారు. పచ్చి మాంసాన్ని పెద్ద ముక్కలుగా మనుషులు వెళ్లే ఆ బోనుకు బయటి వైపు తగిలేస్తుంటారు. దీంతో ఆ జంతువులు బోను వైపు వస్తాయి. వాటి చుట్టే తిరుగుతుంటాయి. ఆ మాంసం తిని అక్కడే కాసేపు సేద తీరుతాయి. ఒక్కోసారి ఆ బోను ఎక్కి కూడా ఆడుకుంటూ ఉంటాయి.

ఈ జూకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ఎక్కింది. ఓ ట్విట్టర్ యూజర్ ఈ జూకు సంబంధించిన షార్ట్ వీడియోను పోస్టు చేశారు. ఆయన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా పెట్టారు. ఇది మనుషులు జూ అని, జంతువులు భయంకరమైన మనుషులను ఆ బోనుల్లో చూడవచ్చని పేర్కొన్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియో క్లిప్‌కు 876 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐదు వేలకు మించి రీట్వీట్లు చేశారు. 

జూ అంటే ఇలా ఉండాలి.. జంతువులనే ఎందుకు బోనులో పెట్టాలి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మిగతా జూ కంటే ఇది ఎలా భిన్నం అని ఇంకో యూజర్ ప్రశ్నించాడు. అంటే.. జంతువులను ఈ విధంలోనైనా గోడల మధ్య బంధిస్తున్నారు కదా.. ఆ గోడల మధ్యలోకి బోనులో మనుషులను పంపిస్తున్నారు అనే అర్థం వచ్చేలా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆసక్తిగా ఉన్నా.. వన్య ప్రాణులు మాత్రం తమ సహజ ఆవాసాలకు దూరంగానే ఉండాల్సి వస్తున్నది కదా.. అంటూ మరొకరు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios