పాకిస్థాన్‌లో మహిళల సమాధులకు తాళాలు.. అసలు నిజానిజాలు ఏమిటంటే..?
పాకిస్థాన్ లో తమ కూతుర్ల సమాధులకు తల్లిదండ్రులు తాళాలు వేస్తున్నారు. ఆ దేశంలో ఇటీవల నెక్రోఫీలియా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తమ కూతుర్ల మృతదేహాలపై లైంగిక దాడి జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారు.
పాకిస్థాన్‌లో చనిపోయిన మహిళల సమాదులకు వారి కుటుంబ సభ్యులు బంధువులు తాళాలు వేస్తున్నారనే వార్త సంచలనంగా మారింది. చనిపోయిన వారిని అత్యాచారాల బారి నుంచి కాపాడేందుకే ఈ రకంగా చేస్తున్నారని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆ దేశంలో నెక్రోఫీలియా(చనిపోయిన వారితో శృంగారంలో పాల్గొనడం) కేసులు పెరుగుతుండటమే తల్లిదండ్రుల ఈ వింత చర్యకు కారణమని ‘డైలీ టైమ్స్’ నివేదించింది. దీంతో పాకిస్తాన్‌లో పరిస్థితులపై చర్చ మొదలైంది.
పాకిస్థాన్‌లో ప్రతీ రెండు గంటలకు ఓ మహిళ అత్యాచారానికి గురవుతున్నారు. అదే సమయంలో మృతదేహాలపై కూడా అమానుషంగా వ్యవహరించేవారు పెరిగిపోతున్నారు. అందుకే స్త్రీల సమాధులకి తాళాలు వేసి ఉన్న హృదయ విదారకర దృశ్యాలు ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇవి పాకిస్థాన్ మొత్తం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయని ‘డైలీ టైమ్స్’ సంపాదకీయంలో మాజీ ముస్లిం నాస్తిక కార్యకర్త, ‘ది కర్స్ ఆఫ్ గాడ్, వై ఐ లెఫ్ట్ ఇస్లాం’ రచయిత హారిస్ సుల్తాన్ పేర్కొన్నారు.
ఈ ఘటనలపై ట్విటర్ యూజర్ సాజిద్ యూసఫ్ షా స్పందిస్తూ.. ‘‘పాకిస్థాన్ సృష్టించిన సామాజిక వాతావరణం లైంగిక వేధింపులకు, అణచివేత సమాజానికి దారితీసింది. దీంతో లైంగిక హింస నుండి రక్షించడానికి కొంతమంది తమ కుమార్తెల సమాధులకు తాళాలు వేస్తున్నారు. అత్యాచారానికి, ఓ వ్యక్తి దుస్తులకు మధ్య లింక్ పెట్టడం వల్ల కలిగిన దుఃఖం, నిరాశ ఇలాంటి చర్యలకు దారితీశాయి’’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ప్రచారం మరింత వైరల్‌గా మారింది.
అసలు ఆ ఫొటోలు ఎక్కడివి..?
అయితే డైలీ టైమ్స్ రిపోర్టు చేయడం, పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ట్వీట్‌లు చేయడంతో.. ఈ ఘటన పాకిస్తాన్‌లోనే చోటుచేసుకుందని అంతా నమ్మారు. అయితే ఆ వీడియో పాకిస్తాన్‌కు చెందినది కాదని తాజాగా వెలుగులోకి వచ్చింది. నెక్రోఫిలియా నుండి రక్షించడానికి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులపై తాళాలు వేస్తున్నారని కూడా కొందరు సోషల్ ప్రచారం చేశారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని తేలింది.
సమాధికి సంబంధించిన వీడియో పాకిస్థాన్‌కు చెందినది కాదని.. భారతదేశంలోని హైదరాబాద్‌కు చెందినదని తేలింది. తాళం వెనుక అసలు కారణం కూడా వెలుగులోకి వచ్చింది. ఆ సమాధి హైదరాబాద్‌లోని మాదన్నపేటలోని దర్బాజాంగ్ కాలనీకి చెందినది. తాళం వేసి ఉన్న సమాధి రెండేళ్ల క్రితం మరణించిన మహిళది. అయితే ఆ సమాధిపైన ఇతరులు వారి బంధువుల మృతదేహాలను పాతిపెట్టకుండా నిరోధించడానికి గ్రిల్స్‌ను ఉపయోగించి తాళం వేశారు. ఈ మేరకు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.