బ్రెజిల్ లోని అమెజాన్ లో కూలిన విమానం.. 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మృతి
బ్రెజిల్ లోని బార్సెలోస్ ప్రావిన్స్ లో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇందులో 12 మంది ప్రయాణికులు ఉండగా.. మిగితా ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంపై అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా విచారం వ్యక్తం చేశారు.
బ్రెజిల్ లోని ఉత్తర అమెజాన్ రాష్ట్రంలో శనివారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని మనౌస్ కు 400 కిలోమీటర్ల దూరంలోని బార్సెలోస్ ప్రావిన్స్ లో విమానం కుప్పకూలింది. బార్సెలోస్ లో జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మృతి చెందడం పట్ల తాను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని అమెజాన్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా అన్నారు.
అవసరమైన సహకారం అందించేందుకు తమ బృందాలు మొదటి నుంచి పనిచేస్తున్నాయని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై మనౌస్ ఏరోటాక్సీ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. బార్సెలోస్ ప్రావిన్స్ లో విమానం కుప్పకూలిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో సంభవించిన మరణాలు, లేదా గాయాల గురించి ఇంకా ఎలాంటి వివరాలను అందులో వెల్లడించలేదు.
ఈ క్లిష్ట సమయంలో పాల్గొన్న వారి గోప్యతను గౌరవిస్తామని తెలిపింది. దర్యాప్తు ముందుకు సాగుతున్న క్రమంలో అవసరమైన సమాచారం, నవీకరణలను అందజేస్తామని పేర్కొంది. మృతుల్లో అమెరికా పౌరులు కూడా ఉన్నారని కొన్ని బ్రెజిల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. కాగా.. రాయిటర్స్ ఆ వార్తలను ధృవీకరించలేకపోయింది.