జపాన్ లో బ్లూఫిన్ టూనా చేప భారీ ధరకు అమ్ముడుపోయింది. 200కిలోలకు పైగా బరువున్న ఈ చేప ఖరీదు రెండు కోట్ల రూపాయలకు పై మాటే.
జపాన్ : జపాన్ లో ఓ చేపకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇది ఒకే చేప. బరువు 200 కిలోలకు పైగానే బరువుంటుంది. దాన్ని ఒక్కదాన్ని పట్టుకుని వేలం వేస్తే.. కోట్లలో ధర పలుకుతుంది. అదేం చేప అంటారా? బ్లూఫిన్ టూనా చేప. గురువారం ఈ చేపను జపాన్ రాజధాని టోక్యోలోని టొయొసులో వేలం వేశారు. 212 కిలోల బరువున్న ఈ చేపను మార్కెట్లో వేలం వేస్తే 36 మిలియన్ యెన్ ల ధరకు అమ్ముడుపోయింది. అంటే దాదాపు 2,73,000 డాలర్లు అన్నమాట. ఇక మన రూపాయల్లో చెప్పుకుంటే.. 2.25 కోట్లు మాత్రమే.
జాలర్లు ఈ భారీ చేపను అవోమోరిలోని ఒమా దగ్గర పట్టుకున్నారు. జపాన్ లో ఇలా భారీ సైజులో ఉన్న చేపను పట్టుకుని వేలం వేయడం యేటా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటివరకు ఈ చేప వేలంలో 1999నుంచి జరిగిన వేలంలో ఇది ఆరో గరిష్ట ధర. గతేడాది పట్టుకున్న చేప 210కిలోలుంది. దీన్ని వేలం వేస్తే 2,02,000డాలర్లు పలికింది. అంతకుముందు 2020లో పట్టుకున్న చేప 300 కిలోల బరువుంది. అయితే ధర మాత్రం 1.8 మిలియన్ డాలర్లే పలికింది.
2019లో మాత్రం దశాబ్ద కాలంలో కనీవినీ ఎరగని రీతిలో ఆ యేడు పట్టుకున్న బ్లూఫిన్ చేప ఏకంగా 3.1మిలియన్ డాలర్ల వరకు వేలం పాట వెళ్లింది. ఆ తరువాత దీని ఖరీదులో తగ్గుదల కనిపిస్తుంది. కారణం కరోనా ప్రభావమే అని.. దీనివల్లే చేపరేటు పడిపోతుందని అనుకుంటున్నారు.
ఒమా బ్లూఫిన్ టూనా చేప భారీగా ఉంటుంది. దీని బరువులాగే దీంట్లో పోషకాలు కూడా భారీగా ఉంటాయి. అందుకే ఈ చేపను బ్లాక్ డైమండ్ అంటారు. అందుకే దీని రేటు కోట్లలో పలుకుతుంది. ఈ వేలాన్ని యేటా ఆనవాయితీగా చేయడాన్ని కియోషి కిమురా మొదలుపెట్టారు. ఆయన జపనీస్ సూషీ చెయిన్ అయిన ‘సూషీ జన్మాయ్’ అధ్యక్షుడు.
అయితే ఈ సంప్రదాయంలో ఈ యేడాది కొంత మార్పు కనిపించింది. ఈ సారి ఈ వేలాన్ని లూక్సే సుషీ జింజా ఒనోడెరా చెయిన్ ఓనర్ చేపట్టారు. ఆయన పేరు హిరోషి ఓనోడెరా. కాబట్టి ఈ చేపను ఓమోటెసాండో జిల్లాలోని ఓనోడెరా రెస్టారెంట్లో వండుతారు. అక్కడే వడ్డిస్తారు. అంతేకాదండోయ్.. దీన్ని వండాలంటే మామూలు వంటగాళ్లు సరిపోరు. దేశంలో ప్రసిద్ధి గాంచిన, చేయి తిరిగిన వంటగాళ్లకు మాత్రమే సాధ్యమట.
