ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించిన క్షిపణులు ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన తెలిసిందే. దీనిమీద పోలాండ్ జాతీయ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రష్యా క్షిపణి వల్లే పౌరులు మరణించారని తేల్చింది.
పోలాండ్ : ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో రష్యా క్షిపణులు ఇద్దరి ప్రాణాలు బలిగొన్నాయి. పోలాండ్ సరిహద్దుకు సమీపంలో మంగళవారం జరిగిన పేలుడులో ఇద్దరు పోలిష్ పౌరుల మరణించారు. దీనికి రష్యా నిర్మిత క్షిపణి కారణమని పోలాండ్ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా విస్తృతంగా క్షిపణి దాడులు జరుపుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం ఆందోళనలను పెంచింది.
ఈ పేలుడు నేపథ్యంలో పోలాండ్ జాతీయ భద్రత, రక్షణ మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా మాట్లాడుతూ.. . దేశ ప్రాదేశిక సమగ్రత లేదా భద్రతకు ముప్పు వాటిల్లినప్పుడు అమలు చేయదగిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ చార్టర్ ఆర్టికల్ 4ను అమలు చేయడానికి సమయం ఆసన్నమయిందని అన్నారు. పోలండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ క్షిపణి రష్యా-నిర్మితమేనని చెప్పారు.
దుడా విలేకరులతో మాట్లాడుతూ, "ఇది రష్యా-నిర్మిత క్షిపణి కావచ్చు, అయితే అది రష్యానే ప్రయోగించిందా.. మరెవరైనా ప్రయోగించారా? అనే దానిమీద మా దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు, ఇప్పుడదంతా విచారణలో ఉంది’’ అని ఆయన తెలిపారు. దీనిమీద తక్షణమే పూర్తిస్తాయి వివరణ ఇవ్వాలని రష్యా రాయబారికి పోలాండ్ విదేశాంగ మంత్రి జిబిగ్నివ్ రౌ అడిగారని మంత్రిత్వ శాఖ నుంచి వెలువుడిన ఒక ప్రకటనలో తెలిపింది.
