జర్మనీలో దారుణం చోటుచేసుకుంది. బార్ లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. సినీ ఫక్కీలో ఆయుధాలతో బార్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటలో దాదాపు 8మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  కాగా... దుండగుల్లో ఒకరు మాత్రం పోలీసులకు చిక్కాడు. 

Also Read రియల్ లైఫ్‌లో ‘‘పా’’ : 8 ఏళ్లకే 80 ఏళ్ల బామ్మలా.. అరుదైన వ్యాధితో కన్నుమూసిన చిన్నారి...

జర్మనీలోని హనావు సిటీలో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ దురాగతం చోటు చేసుకుంది. కర్ట్ షూమాకర్ ప్లాజ్‌‌లో చాలాకాలం నుంచి హుక్కా బార్లు నడుస్తున్నాయి. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుందని... ఈ నేపథ్యంలో దుండగులు దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది. మొత్తంగా రెండు బార్లలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండుగులు ఎందుకు కాల్పులు జరిపారు అనే విషయం పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.  కాల్పుల ఘటనను అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.