Christmas Party: వికటించిన క్రిస్మస్ విందు.. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 700 మందికి అస్వస్థత..  

Christmas Party: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో ఒక్కసారిగా ఆందోళన చెలారేగింది. పార్టీలో విందు ఆరగించిన తరువాత ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. వారందరూ వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం. 

700 Airbus employees fall sick after Christmas party KRJ

Christmas Party: క్రిస్మస్ పండుగ దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందులో ఒక్కసారిగా ఆందోళన చెలారేగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700 మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపింది. 

మీడియా కథనాల ప్రకారం.. పశ్చిమ ఫ్రాన్స్ లోని మోంటోయిర్ డి బ్రిటేన్ లో ఎయిర్ బస్ అట్లాంటిక్ ఉద్యోగులకు క్రిస్మస్ పార్టీ ఏర్పాటు  చేశారు. కంపెనీ ప్రాంగణంలోనే ఉన్న ఓ రెస్టారెంటులో ఈ విందుకు ఏర్పాటు చేశారు. ఈ విందులో దాదాపు 2,600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారి కోసం అనేక రకాల నోరూరించే వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. 

ఈ విందులో లాబ్ స్టర్లు, ఆల్చిప్పలు, బీఫ్ తదితర వంటకాలను అతిథులకు వడ్డించారు. అయితే, విందు ఆరగించిన తరువాత.. దాదాపు 700 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో కొందరు ఉద్యోగులకు వాంతులు చేసుకోవడంతోపాటు పలు సమస్యలు వచ్చాయి.

 ఈ ఉద్యోగులలో చాలా మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ (ARS) ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ఉద్యోగులకు మెరుగైన వైద్య ఏర్పాట్లు చేశారు. ఆహారం నాణ్యత లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఫుడ్ పాయిజన్ కారణంగానే ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. క్రిస్‌మస్ పార్టీ డిన్నర్‌లో ఏ రకమైన ఆహారాన్ని అందించారనే దానిపై దర్యాప్తు జరుగుతోందని ఫ్రెంచ్ హెల్త్ ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. నాణ్యతలో రాజీ పడిందా? లేదా? మరేదైనా సమస్య ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. పుడ్ శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం పంపారు.

ఎయిర్‌బస్ అట్లాంటిక్ అనేది ఎయిర్‌బస్ కంపెనీకి అనుబంధ సంస్థ. ఇది ఐదు దేశాల్లో కనీసం 15,000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విమానాల తయారీ సంస్థ. ఫ్రాన్స్‌లో కూడా దాని ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ.  ఇదిలా ఉంటే.. క్రిస్మస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇతర పశ్చిమ దేశాలతో పాటు భారతదేశంలో కూడా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios