అమెరికాలో బుధవారం భూకంపం చోటు చేసుకుంది. అలస్కా పీఠభూమిలో సాయంత్రం 6.12 గంటలకు రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆంకోరేజ్‌కు నైరుతి దిశగా 800 కిలోమీటర్ల దూరం, పెర్రివిలెకు ఆగ్నేయ దిశగా 96 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

తీవ్రత, ఇతర ప్రమాణాల ఆధారంగా భూకంప కేంద్రం నుంచి దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం వుంది. దీని కారణంగా సముద్ర తీరానికి సమీపంలో, దీవుల్లో, దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

అయితే భూకంపం తర్వాత చాలా సేపటి వరకు సాధారణ అలలు మాత్రమే రావడంతో అలస్కాలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. కానీ కొడియాక్ దీవుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న వేలాది మందిని మాత్రం ఖాళీ చేయించారు.