తైవాన్‌లో భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ
తైవాన్ లో ఇవాళ ఉదయం భారీ భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావంతో సునామీ కూడ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
టోక్యో:తైవాన్ లోని తైపీలో బుధవారం నాడు భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను కూడ అధికారులు జారీ చేశారు.తైవాన్ తో పాటు జపాన్ లోని పలు ప్రాంతాల్లో సునామీ ఏర్పడే అవకాశం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
తైవాన్ లో చోటు చేసుకున్న భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదైంది. తైవాన్ లోని హువాలియన్ సిటీకి దక్షిణంగా 18 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని యునైటేడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు గుర్తించారు.
మియాకోజిమా ద్వీపంతో పాటు జపాన్ లోని దీవుల్లో సునామీ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. సునామీ కారణంగా 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.1999లో తైవాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2,400 మంది మరణించారు.భూకంపాల కారణంగా ప్రతి ఏటా జపాన్ లో 1500 మంది మరణిస్తున్నారు.
2011లో 9.0 తీవ్రతతో జపాన్ లో భూకంపం చోటు చేసుకుంది.ఈ భూకంపం కారణంగా 18,500 మంది మృత్యువాత పడ్డారు. ఈ భూకంపంతో జపాన్ లోని మూడు అణు రియాక్టర్లు దెబ్బతిన్నాయి. దరిమిలా తీవ్రమైన అణు ప్రమాదం చోటు చేసుకుంది.