ఇండోనేషియాలో 6.6 తీవ్రతతో భారీ భూకంపం..
ఇండోనేషియాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ నార్త్ మలుకులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇండోనేషియాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ నార్త్ మలుకులో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఇది సునామీని ప్రేరేపించే అవకాశం లేదని పేర్కొంది. ఉదయం 9.48 గంటలకు భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం పశ్చిమ హల్మహెరా రీజెన్సీకి వాయువ్యంగా 68 కి.మీ దూరంలో సముద్రంలో 109 కి.మీ లోతులో ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. ఇక, సమీపంలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.
అయితే ఈ ప్రకంపనలు కారణంగా పెద్ద అలలు ఎగసిపడనందున వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికను జారీ చేయలేదు. అయితే భూకంపం వల్ల ఒక వ్యక్తి మరణించినట్లు స్థానిక విపత్తు అధికారి ఒకరు తెలిపారు. టెల్‌కోమ్‌సెల్ నిర్వహించే టవర్‌ను కూల్చివేయడానికి ఒక కార్మికుడు పని చేస్తున్నప్పుడు భూకంపం సంభవించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. భూకంపం ధాటికి నగరం, ప్రావిన్స్‌లోని ఇతర ప్రాంతాలలోని ఇతర భవనాలు, ఇళ్లు దెబ్బతినలేదని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
ఇక, ద్వీపసమూహ దేశమైన ఇండోనేషియా.. ‘‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’’గా పిలిచే హాని కలిగించే భూకంప జోన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.