అమెరికాలో మరోసారి తూటాల వర్షం కురిసింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న ఓ కమ్యూనిటీ న్యూస్ పేపర్ న్యూస్‌రూమ్‌లో గుర్తు తెలియని సాయుధ దుండగుడు కాల్పులకు దిహబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దుండగుని వద్ద షాట్‌గన్ మరియు స్మోక్ గ్రెనేడ్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అతను ఎవరనే విషయాన్ని ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. అన్నాపోలిస్ పట్టణంలోని క్యాపిటల్ గెజిట్ పత్రిక కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. వంటి నిండా ఆయుధాలతో వచ్చిన దుండగుడు పత్రికా కార్యాలయం లోపలికి కిటికీ అద్దాల గుండా కాల్పులు జరిపాడని, దాంతో అక్కడి వారంతా భయభ్రాంతులకు గురై పరుగులు తీసారని పత్రిక సిబ్బంది తెలిపారు.

ఇటీవల ఈ పత్రికకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయని, ఇది కేవలం ఆ వార్తాపత్రికను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడేనని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు తన గుర్తింపును దాచుకోవటం కోసం చేతి వేలి కొనలను గాయపరుచుకున్నట్లు పోలీసులు మీడియాతో చెప్పారు. అతని వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, మేరీల్యాండ్‌కు చెందిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కాల్పుల విషయం తెలుసుకున్న వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించారు.