పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ చీఫ్ హెడ్ ఆఫీస్ భవనంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ (పాకిస్థాన్)కి చెందిన ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీస్ చీఫ్ హెడ్ ఆఫీస్ భవనంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ (పాకిస్థాన్)కి చెందిన ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. అయితే ఉగ్రదాడిని ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దాదాపు నాలుగు గంటల తర్వాత పోలీస్ చీఫ్ హెడ్ ఆఫీస్ భవనంపై భద్రతా బలగాలు తిరిగి నియంత్రణ సాధించారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఉగ్రదాడిలో మరో నలుగురు మరణించారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు వారిని వారే పేల్చుసుకోగా.. మరో ముగ్గురిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల దాడిలో మరణించిన నలుగురిలో ఇద్దరు పోలీసులు, రేంజర్స్ అధికారి, ఒక పౌరుడు ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
శుక్రవారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు భవనం వద్దకు వచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. భవనం వెనక ద్వారం ఒకటి తెరిచి ఉంచడటంతో అక్కడి నుంచి లోనికి వచ్చారు. అధునాతన ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పోలీసులు యూనిఫాం ధరించి ఉగ్రవాదులు పోలీసు భవనంలోకి ప్రవేశించారు. భవనంలోని ప్రవేశించగానే బీభత్సం సృష్టించారు. స్థానిక మీడియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం.. ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్లు, ఆటోమేటిక్ గన్స్‌ను ఉపయోగించి దాడికి దిగారు. దాడి తరువాత కరాచీ పోలీసులు, పాకిస్తాన్ రేంజర్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. భవనాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఆపరేషన్ రాత్రి 10.50 గంటలకు నాటకీయంగా ముగిసింది.
ఇద్దరు ఉగ్రవాదులు వారిని వారే పేల్చేసుకోవడం వల్ల.. భనవంలోని ఒక అంతస్తుకు కొంత నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీస్ చీఫ్ కార్యాలయం పక్కనే ఉన్న సద్దర్ పోలీస్ స్టేషన్ కూడా దాడి జరిగింది. ‘‘కరాచీ పోలీస్ ఆఫీస్ సమీపంలోని సద్దర్ పోలీస్ స్టేషన్‌పై గుర్తు తెలియని నిందితులు దాడి చేశారు. ప్రతిచోటా కాల్పులు జరిగాయి’’ అని పోలీసులు తెలిపారు.
అయితే భవనంలో ప్రవేశించి దాడికి పాల్పడిన ఉగ్రవాదుల సంఖ్యపై భిన్నమైన వాదనలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు మొత్తం ఎనిమిది మంది ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే తాము భవనాన్ని నియంత్రణలోని తీసుకున్నామని.. ప్రస్తుతం కూంబింగ్, క్లీన్ అప్ ఆపరేషన్ నిశితంగా నిర్వహిస్తున్నామని పోలీసులు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి స్పష్టమైన వివరాలు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. బాంబు స్క్వాడ్ దళం.. ఉగ్రవాదులు పోలీసు కార్యాలయానికి వచ్చిన రెండు కార్లను, ఉగ్రవాదులు ధరించిన దుస్తులలో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా? అని తెలుసుకోవడానికి తనిఖీ చేసినట్టుగా చెప్పారు.
