Asianet News TeluguAsianet News Telugu

46 మంది మృతి.. 100 మందికి గాయాలు.. పోలీసులే లక్ష్యంగా మసీదులో పేలుడు.. అఫ్గాన్‌లో చంపేస్తే పాక్‌లో ప్రతీకారం

పాకిస్తాన్‌‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. పోలీసులు, ఆర్మీ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారు. 100 మంది గాయపడ్డారు. ఇందులో పోలీసులే అధికంగా ఉన్నారు. టీటీపీ ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడని, అఫ్గాన్‌లో మరణానికి ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్టు ఓ టెర్రరిస్టు తెలిపాడు.
 

46 killed, 100 injured in pakistani taliban attack in mosque
Author
First Published Jan 30, 2023, 8:18 PM IST

పేషావార్: పాకిస్తాన్‌లోని పేషావర్ నగరం వణికిపోయింది. మసీదులో ఆత్మాహుతి దాడితో క్షణాల్లో అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు పక్కనే ఉండే, గట్టి భద్రత ఉండే మసీదులో ఆత్మాహుతి దాడి అందరినీ ఖంగుతినిపించింది. పోలీసులు, ఆర్మీ, బాంబ్ డిస్పోస్‌డ్ స్క్వాడ్‌లే లక్ష్యంగా మసీదులో టెర్రరిస్టుల ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ఎక్కువ మంది బాధితులు పోలీసులే ఉన్నట్టు సెక్యూరిటీ, వైద్యారోగ్య అధికారులు చెప్పారు.

పోలీసు లైన్స్ ఏరియాలోని మసీదులో ఈ రోజు మధ్యా హ్నం 1.40 గంటల ప్రాంతంలో మధ్యాహ్నపు ప్రార్థనలకు అందరూ గుమిగూడిన సమయంలో ఓ టెర్రరిస్టు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ముందటి వరుసలో కూర్చున్న సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఇప్పటి వరకు 46 మంది మరణించినట్టు లేడీ రీడింగ్ హాస్పిటల్ అధికారులు తెలిపారు. పేషావర్ పోలీసులు ఇప్పటి వరకు 38 మంది బాధితుల జాబితా విడుదల చేశారు.

ఈ పేలుడు ఒక ప్రతీకార చర్య అని తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టెర్రరిస్టు ఉమర్ ఖాలీద్ ఖురసానీ తెలిపాడు. అఫ్గానిస్తాన్‌లో తన సోదరుడిని చంపేశారని, అందుకు ప్రతీకారంగానే ఈ ఆత్మాహుతి దాడి అని పేర్కొన్నాడు.

Also Read: ఉగ్ర స్థావరంగా పాకిస్థాన్ .. ఇప్పటి వరకు 150 మంది ఉగ్రవాదులు, ఉగ్ర గ్రూపులను బ్లాక్‌లిస్ట్‌ చేసిన ఐక్యరాజ్యసమితి

నిషేధిత టీటీపీ లేదా పాకిస్తానీ తాలిబాన్ కొన్నాళ్లుగా చాలా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నది. ముఖ్యంగా సెక్యూరిటీ సిబ్బందిని టార్గెట్ చేసుకుని ఈ దాడులకు పూనుకుంటున్నది. 

ఈ ఆత్మాహుతి దాడితో మసీదులోని చాలా భాగం కూలిపోయింది. చాలా మంది ఆ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని పోలీసు అధికారులు చెబుతున్నారు. మసీదులోకి ప్రవేశించడానికి నాలుగు అంచెల భద్రత ఉంటుందని, అయినా, ఆ టెర్రరిస్టు లోపటికి వచ్చాడంటే భద్రతా లోపం జరిగినట్టు స్పష్టంగా అర్థం అవుతున్నదని పేషావర్ క్యాపిటల్ సిటీ పోలీసు అధికారి ముహమ్మద్ ఇజాజ్ ఖాన్.. డాన్ న్యూస్ పేపర్‌కు తెలిపాడు. ఇంకా శిథిలాల కింద పలువురు జవాన్లు చిక్కుకుని ఉన్నారని వివరించారు.

పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసినవారికి ఇస్లాంతో ఏ మాత్రం సంబంధం లేదని అన్నారు. పాకిస్తాన్ కాపాడే బాధ్యతలో ఉన్నవారిని టార్గెట్ చేసుకుని భయాన్ని వ్యాపింపజేయాలని ఆ టెర్రరిస్టులు భావిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, ఉగ్రవాద బెడదను ఎదుర్కోవడానికి దేశమంతా ఏకతాటిపై నిలబడి ఉన్నదని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios