న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో గల ఓ ప్రైవేట్ సోషల్ క్లబ్ వద్ద సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. 

నిందితుడిని గుర్తించాల్సి ఉందని, ఎందుకు కాల్పులు జరిపాడనేది విచారణలో తేలుతుందని న్యూయార్క్ పోలీసు విభాగం అధికార ప్రతినిధి చెప్పాడు. బ్రూక్లిన్ లోని క్రౌన్ హైట్స్ సమీపంలో గల నైట్ క్లబ్ వద్ద ఈ కాల్పుల సంఘటన చోటు చేసుకుంది. కాల్పుల విషయం శనివారం ఉదయం 6.55 గంటల సమయంలో తమకు తెలిసిందని పోలీసులు చెప్పారు. 

గాయపడినవారిలో ఓ మహిళ, ఇద్దరు పురుషుల పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి ప్రాణాపాయం లేదని అధికారులు చెబుతున్నారు. నలుగురు అక్కడికక్కడే మరణించారు.