ఇండోనేషియాలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 35కి చేరినట్లు ఇండోనేషియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. తెల్లవారుజామున సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భూమి కంపించింది.

ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది చనిపోగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. భవన శిథిలాల కింది అనేక మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది.  దీంతో జనం ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

భూకంపం ధాటికి కనీసం 62 భవనాలు కుప్పకూలినట్లు ఏజెన్సీ వెల్లడించింది. మజెనీ ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు.

 ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.