కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. బంగారం గని 30 మందిని బలి తీసుకుంది. గ్రామస్తులు బంగారం గని 200 అడుగుల లోతులో తవ్వుతుండగా ప్రమాదం సంభవించింది.  దాని చుట్టూ ఉన్న గోడలు కూలి వారి మీద పడ్డాయి. 

దాంతో ఊపిరాడకపోవడంతో 30 మంది మృత్యువాత పడ్డారు. 7గురు గాయపడ్డారు. ఆప్ఘనిస్తాన్‌లోని కొహిస్తాన్ జిల్లా బదక్షన్ ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. తవ్వకాలు జరిపిన వ్యక్తులు అనుభవం లేనివారు కావచ్చునని, అందుకే గోడలు కూలి ఉంటాయని ప్రావిన్స్ గవర్నర్ నిక్ మహ్మద్ నజరి తెలిపారు. 

ఈ గ్రామస్తులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని, వీరిపై ప్రభుత్వ నియంత్రణ లేదని ఆయన చెప్పారు. ఘటనా స్థలికి సహాయక బృందాలను పంపించామని, అప్పటికే గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారని ఆయన చెప్పారు. 

చలికాలంలో జీవించడానికి గ్రామస్థులు అక్రమ తవ్వకాలు జరుపుతుంటారని నజరి అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు 50 మంది అక్రమ తవ్వకాల్లో పాల్గొన్నట్లు అధికార వర్గాలు చెప్పాయి.