యెమెన్ లో ఉగ్రవాదులు భారీ దాడికి పాల్పడ్డారు. యెమెన్ దేశ ప్రధాన మంత్రి, నూతన మంత్రి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో.. 26మంది సాదారణ పౌరులు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. అంతేకాకుండా 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

యెమెన్‌లోని ఆదెన్ విమానాశ్రయంలో దుండగులు మారణహోమానికి తెగబడ్డారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ పెద్దలకు ఘనంగా స్వాగతం పలకడానికి అధికారులు, ప్రజలు ఎయిర్‌పోర్టులో పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇంతలోనే ప్రధాని మోయిన్ అబ్దుల్ మాలిక్, 10 మంది మంత్రులతో వచ్చిన ప్రత్యేక విమానం అక్కడ ల్యాండ్ అయింది. విమానం నుంచి వారు కిందికి దిగుతుండగా.. అక్కడ గుమిగూడిన వారంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సరిగ్గా అదే సమయంలో భారీ శబ్దంతో బాంబు పేలింది.

రన్‌వేకు సమీపంలో ఓ పక్కన పార్క్ చేసిన కారును ఒక్కసారిగా పేల్చివేసినట్లు తెలుస్తోంది. రాకెట్ బాంబు దాడికి పాల్పడినట్లు కొన్ని మీడియా సంస్థలు రాశాయి. శక్తివంతమైన బాంబు దాడిలో కొంత మంది శరీర భాగాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి. పేలుడు అనంతరం ఎయిర్‌పోర్టులో పొగ కమ్ముకుంది.

పేలుడు అనంతరం కొంత మంది ప్రాణ భయంతో ప్రవేశమార్గం వైపు పరుగులు తీశారు. ఇంతలో అక్కడ మరో బాంబ్ పేల్చారు. పేలుళ్ల అనంతరం దుండగులు కాల్పులకు తెగబడ్డట్లు కొన్ని మీడియా సంస్థలు రాశాయి. బాంబు పేలుడుకు సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.