Asianet News TeluguAsianet News Telugu

2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ఆలంగీర్ కిడ్నాప్ .. ఉలిక్కిపడ్డ పాకిస్తాన్ , మళ్లీ ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ పనే

2019 ఎన్నికలకు ముందు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కీలక సూత్రధారి మొహియుద్ధీన్ ఔరంగజేబ్ అలంగీర్‌ను హఫీజాబాద్‌లో ‘‘‘అజ్ఞాత’’ వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

2019 Pulwama attack conspirator & JeM terrorist Alamgir kidnapped by 'unknown' people in Pakistan ksp
Author
First Published Dec 9, 2023, 3:58 PM IST

2019 ఎన్నికలకు ముందు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కీలక సూత్రధారి మొహియుద్ధీన్ ఔరంగజేబ్ అలంగీర్‌ను హఫీజాబాద్‌లో ‘‘‘అజ్ఞాత’’ వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లోని డేరా హాజీ గులామ్‌లోని కుటుంబ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అతనిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన వ్యక్తులు, కారు గురించిన వివరాలు తెలియరాలేదు. 

30 సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని బలిగొన్న 2019 పుల్వామా ఉగ్రదాడి ప్రణాళిక , అమలులో మొహియుద్ధీన్ ఔరంగజేబ్ ఆలంగీర్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన ప్రపంచ దేశాలను సైతం కలవరపాటుకు గురిచేయడమే కాకుండా భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధా మేఘాలు కమ్ముకునేటట్లు చేసింది. ఆలంగీర్‌ను కిడ్నాప్ చేసిన ఘటన పాకిస్తాన్‌లోని హఫీజాబాద్‌లో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కారులో అతనిని, మొహీయుద్దీన్ బంధువును అడ్డగించి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వీరిద్దరు ఏమైపోయారన్నది తెలియరాలేదు. వారి భద్రత, తదుపరి పరిమాణాల గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

 

కిడ్నాప్ నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు, ముఖ్యంగా ఐఎస్ఐ, సైన్యం రంగంలోకి దిగాయి. కిడ్నాపర్లను పట్టుకోవడానికి హఫీజాబాద్ ప్రాంతంలో దాడులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కిడ్నాపర్లు ఎవరు.. ఎందుకు ఆలంగీర్‌ను కిడ్నాప్ చేసింది తెలియరాలేదు. అయితే ఔరంగజేబు వాడిన మోటార్ సైకిల్‌ను నిర్జన ప్రదేశంలో గుర్తించాయి భద్రతా సిబ్బంది. 2022 ఏప్రిల్‌లో మొహియుద్దీన్ ఔరంగజేబ్ ఆలంగీర్‌ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నిధుల సేకరణ కార్యక్రమాన్ని ఇతను విస్తృతంగా చేస్తున్నాడని, ఆ మొత్తాన్ని కాశ్మీర్‌కు పంపడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆఫ్ఘన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడటానికి, జమ్మూకాశ్మీర్‌లో భారత భద్రతా దళాలపై ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో ఆలంగీర్ ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. 

జనవరి 1, 1983న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌‌లో ఆలంగీర్ జన్మించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని నిబంధనల ప్రకారం గతేడాది భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆలంగీర్‌ను వ్యక్తిగత ఉగ్రవాదిగా అధికారికంగా ప్రకటించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. మక్తాబ్ అమీర్, ముజాహిద్ భాయ్, ముహమ్మద్ భాయ్ ఎం అమ్మర్,  అబు అమ్మర్ మేడమ్ వంటి మారు పేర్లతో ఆలంగీర్ సంచరిస్తున్నట్లుగా తెలిపింది. 

 

 

2019 పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది దుర్మరణం చెందడంలో అలంగీర్ ముఖ్య పాత్ర పోషించాడు. ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కాన్వాయ్‌పై పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (JeM) దాడి చేసింది. ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ లోపల బాలాకోట్‌లోని జెఈఎమ్‌కు చెందిన అతిపెద్ద ఉగ్రవాద శిక్షణా శిబిరంపై భారత యుద్ధ విమానాలు వైమానిక దాడులు నిర్వహించాయి.

ఈ కేసులో దర్యాప్తుకు నాయకత్వం వహిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ).. జేఈఎం చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్, మరణించిన ఉగ్రవాది మహ్మద్ ఉమర్ ఫరూక్, ఆత్మాహుతి బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ , పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న ఇతర ఉగ్రవాద కమాండర్లను నిందితులుగా గుర్తించింది. తీవ్రవాద దాడిలో పాల్గొన్న కీలక వ్యక్తి కిడ్నాప్ ప్రాంతీయ భద్రత , అంతర్జాతీయ సంబంధాలపై విస్తృత ప్రభావాలను కలిగి ఉంది. పుల్వామా దాడి ఇప్పటికే భారతదేశం - పాకిస్తాన్ మధ్య సంబంధాలను దెబ్బతీసింది. తాజాగా ఈ పరిణామం ఉద్రిక్తతలను మరింత పెంచుతుంది. అంతర్జాతీయ సమాజం ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios