రైల్వే ట్రాక్ దాటుతూ ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలోమానవరహిత రైల్వే క్రాసింగ్‌ను దాటే ప్రయత్నంలో ఒక బస్సు రైలును ఢీకొంది.

ఈ ఘటనలో అక్కడికక్కడే 20మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుక్కూర్ జిల్లాలోని రోహ్రీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న బస్సు మానవరహిత రైల్వే క్రాసింగ్‌ను దాటి పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ రైలును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 

Also Read పీకల దాకా తాగి హైడ్ అండ్ సీక్: బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి కునుకు...

ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు సుక్కూర్ కమిషనర్ షఫీక్ అహ్మద్ మెహ్సర్ ధృవీకరించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో బస్సు తునాతునకలయ్యింది. 

ఇది ఘోర ప్రమాదమని సుక్కూర్ పోలీసు అధికారి జమీల్ అహ్మద్ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ రైలు... బస్సును 150 నుంచి 200 అడుగుల వరకు లాక్కొని వెళ్లిపోయిందన్నారు. కాగా సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఘటనా స్థలానికి తక్షణం సహాయక బృందాలను తరలించాలని సుక్కూర్ కమిషనర్‌ను ఆదేశించారు.