ప్రేమ అన్నాకా అందులో సరదాలు, సరసాలు అన్ని ఉంటాయి. దీనిలో భాగంగా బాయ్‌ఫ్రెండ్‌ను ఆటపట్టించాలనుకున్న ఓ మహిళ కటకటాలపాలైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన సారా బూన్ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్ టోర్రెస్ జూనియర్‌తో కలిసి ఇదే నగరంలో నివసిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం మద్యం సేవించిన వీరిద్దరికి ఎందుకో హైడ్ అండ్ సీక్ ‌ఆడాలనిపించింది. దీనిలో భాగంగా సారా.. జార్జ్‌ను ఓ సూట్‌కేసులో పెట్టి తాళం వేసింది. కొద్దిసేపు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి తనను బయటికి రానివ్వాలంటూ జార్జ్ అరవడం మొదలుపెట్టాడు.

అయినప్పటికీ సారా అదేమి పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో రాత్రంతా సూట్‌కేసులోనే ఉండిపోయిన జార్జ్ చివరికి ఊపిరాడక మరణించాడు. తర్వాతి రోజూ సారా బయటకు వచ్చి సూట్‌కేస్ తెరవగా అప్పటికే జార్జ్ మరణించడంతో ఆమె షాక్‌కు గురైంది.

వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యా నేరం కింద సారాను అదుపులోకి తీసుకుని జార్జ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విచారణ సందర్భంగా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన బూన్ మాట్లాడుతూ.. తనకు ఊపిరి ఆడటం లేదని జార్జ్ వేడుకున్నప్పటికీ మద్యం మత్తులో తాను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆ ఫోన్‌లో రికార్డయిన స్టేట్‌మెంట్ మాత్రం బూన్ వాదనకు విరుద్ధంగా ఉంది.

సదరు స్టేట్‌మెంట్‌లో జార్జ్ బూన్‌ను సూట్‌కేసు నుంచి బయటికి తీయమని అడిగినప్పుడు... బూన్ పెద్దగా నవ్వుతూ ‘‘నువ్వు నన్ను మోసం చేసినప్పుడు తనకు కూడా ఇలాంటి ఫీలింగే కలిగిందని’’ ఆ ఫోన్‌లో రికార్డయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జార్జ్‌ను బూన్ ఉద్దేశ్యపూర్వకంగానే హత్య చేసిందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.