ఫ్రెండ్స్ ని చంపేసి.. వారి రక్తంతాగి, మాంసం తినాలని ఇద్దరు అమ్మాయిలు వేసిన ప్లాన్ బెడిసికొట్టింది.  ఈ సంఘటన అమెరికాలోని ఓ పాఠశాలలో వెలుగుచూసింది. తోటి విద్యార్థులను చంపి వారి రక్తం తాగడంతో పాటు మాంసాన్ని తినేందుకు కుట్ర పన్నిన ఇద్దరు స్కూలు విద్యార్థినులపై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ ఫ్లోరిడా పోలీసులు తెలిపారు. తాము సైతాన్‌ అనుచరులమని చెప్పుకొనే విద్యార్థినులు స్కూలు ఫంక్షన్‌ జరుగుతున్న సమయంలో తోటి విద్యార్థుల హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు.

వాష్‌రూంలోకి వెళ్లిన సుమారు 15 మంది బయటికి రాగానే వారిని చంపి, రక్తం తాగి, మాంసం తినాలని భావించారని బార్టో పోలీసు చీఫ్‌ జో హాల్‌ తెలిపారు. ఇందుకోసం పదునైన ఆయుధాన్ని కూడా వెంట తెచ్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత తమని తాము అంతం చేసుకోవాలని కూడా వారు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. స్కూళ్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరి కదలికలను గమనించిన యాజమాన్యం సదరు విద్యార్థినుల తల్లిదండ్రులతో పాటు, తమకు కూడా సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు.