రోడ్డుపక్కన ఉన్న చెరువులో పడిపోయిన బస్సు.. 17 మంది దుర్మరణం..
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి పడిపోవడంతో 17 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 20 మంది వరకు గాయపడ్డారు.

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి పడిపోవడంతో 17 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 20 మంది వరకు గాయపడ్డారు. వివరాలు.. దాదాపు 60 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు భండారియా సబ్ డిస్ట్రిక్ట్ నుంచి నైరుతి డివిజనల్ హెడ్ క్వార్టర్స్ బారిషాల్‌కు వెళ్తుండగా జలకతి జిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ‘‘ఈతగాళ్లు 17 మృతదేహాలను బయటకు తీశారు. భారీ వర్షాల తర్వాత నీటితో నిండిన చెరువు నుండి బస్సును వెలికితీసేందుకు పోలీసు క్రేన్ సాయంతో ప్రయత్నాలు చేస్తున్నాం’’ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ గౌతమ్ కుమార్ ఘోష్ తెలిపారు. అయితే బస్సులో మరిన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.
‘‘నేను డ్రైవర్ సీటు పక్కనే కూర్చున్నాను. బస్సును నడుపుతున్నప్పుడు డ్రైవర్ జాగ్రత్తగా లేడు’’ అని ప్రమాదంలో గాయపడిన 35 ఏళ్ల ప్రయాణీకుడు రస్సెల్ మొల్లా చెప్పారు. ఇక, ఈ ఘటనలో గాయపడిన ఇరవై మందికి పైగా ప్రయాణికులు జలకతిలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.