టెక్సాస్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల్లో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి చెందారు. ఈ కాల్పులకు పాల్పడింది 18సంవత్సరాల టీనేజర్ కావడం గమనార్హం.
టెక్సాస్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్లోని ఒక ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన విద్యార్థుల వయసు నాలుగు నుంచి 14 ఏళ్ల మధ్య ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లలో ఇది అత్యంత ఘోరమైన సంఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రేగ్ అబాట్ వెల్లడించారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఉవాల్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగులు చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.
దీంతో వెంటనే స్థానిక పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి. దుండగుడు తన కారును వదిలేసి రోబ్ ఎలిమెంటరీ పాఠశాలలోకి ప్రవేశించాడు అని, తన వద్ద తుపాకీతో పాటు రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని గవర్నర్ తెలిపారు. ఈ పాఠశాలలో మొత్తం 500 మంది కంటే ఎక్కువే విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. పాఠశాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల సమాచారాన్ని అధ్యక్షుడు జో బైడెన్ కు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపింది..స్థానికంగా నివసించే యూఎస్ పౌరుడు సాల్వడార్ రామోస్ అని అనుమానిస్తున్నారు. అతను కూడా పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోయాడని గవర్నర్ చెప్పారు.
2018లో ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది హై స్కూల్ విద్యార్థులతో పాటు ముగ్గురు టీచర్లు మృతి చెందారు. ఆ ఘటన తర్వాత ఇదే అత్యంత దారుణ సంఘటన. 2020లో అమెరికాలో జరిగిన కాల్పుల్లో 19,350 మంది చనిపోయారు. ఇది 2019 తో పోలిస్తే 35 శాతం అధికమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజాగా పేర్కొంది. ఈ ఘటనతో అమెరికాలో మరోసారి గన్ కల్చర్ మీద ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 3న అమెరికాలో మరోసారి కాల్పులు బీభత్సం జరిగింది. కాలిఫోర్నియాలోని రద్దీగా ఉండే శాక్రమెంటో ఏరియాలో ఆటోమేటిక్ గన్ తో కాల్పులు జరిపి రక్తపాతాన్ని సృష్టించారు. కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో జరిగిన ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు దుర్మరణం చెందినట్టు అధికారులు తెలిపారు. కాగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్టు చెప్పారు. ఈ ఘటన 10వ, కే వీధుల మూలములుపులో ఆదివారం తెల్లవారు జామున 2.30 గంటలకు (09.30 జీఎంటీ) చోటు చేసుకుంది.
శాక్రమెంటోలో కాల్పులు జరిపిన సమయంలో చాలామంది ఉన్నారు. రెస్టారెంట్లు, బార్లలో ఎక్కువమంది చాలా ఉన్నారు. వారిపైనే ఓ ఆటోమేటిక్ గన్ తో కాల్పులు జరిగాయి. అయితే, ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. ఘటన జరగ్గానే వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షణాల్లో అంబులెన్స్‌లు స్పాట్‌కు చేరుకున్నాయి.
కాల్పులు జరగ్గానే పోలీసులు వెంటనే స్థానికంగా అలర్ట్ చేశారు. 9వ వీధి నుంచి 13వ వీధి మధ్య ఏరియాను క్లోజ్ చేసింది. ఈ ఏరియాల్లో పోలీసులు బలగాలు పెద్ద మొత్తంలో ఉంటాయని, ఈ ఏరియాలోకి రావొద్దని ప్రజలను పోలీసులు కోరారు. అంతేకాదు, ఈ ప్రాంతం ఇంకా యాక్టివ్‌గానే ఉన్నదని తెలిపారు.
