విషాదం.. బొగ్గు గని కూలి 12 మంది బాలురు మృతి..
బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్లు దుర్మరణం చెందిన ఘటన పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జరిగింది. దీనిపై బలుచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. హర్నాయ్ జిల్లా జర్దాలో ప్రాంతంలోని బొగ్గు గని కూలిపోవడంతో 12 మంది మైనర్ బాలురు మరణించారు. మరో 8 మందిని అధికారులు రక్షించారు. రాత్రి సమయంలో గనిలో 20 మంది మైనర్లు ఉన్నారని, అయితే ఒక్క సారిగా మీథేన్ గ్యాస్ పేలిందని అధికారులు తెలిపారు. దీంతో గని కూలిపోయిందని వెల్లడించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ స్పందించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని ‘జియో న్యూస్’ తెలిపింది. దీంతో 12 మంది మైనర్ల మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. మరో 8 మందిని రక్షించారు.
గనిలో రాత్రికి రాత్రే మీథేన్ వాయువు పేరుకుపోయిందని, దీంతో పేలుడు సంభవించిందని బలూచిస్థాన్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మైన్స్ అబ్దుల్ ఘనీ బలోచ్ తెలిపారు. ప్రభుత్వ మైనింగ్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సహాయక చర్యలు పూర్తి చేశాయని, మొత్తం 12 మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అయితే పేలుడు సమయంలో గనిలో ఎంతమంది మైనర్లు ఉన్నారనే దానిపై భిన్న కథనాలు వెలువడ్డాయి. మొదట్లో కేవలం పది మంది మైనర్లు మాత్రమే ఉన్నారని భావించారు, తరువాత 18 మంది, చివరగా 20 అని తేలింది.
ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. జాతీయ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్, డిప్యూటీ స్పీకర్ సయ్యద్ గులాం ముస్తఫా షా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కాగా.. ఖనిజ సంపద అధికంగా ఉండే బలూచిస్థాన్ ప్రావిన్స్ లో మైనర్ల మరణాలు తరచుగా నమోదవుతున్నాయి. ఇక్కడ క్రమబద్ధీకరించని మైనింగ్ ప్రధాన సమస్యగా ఉందని ప్రావిన్స్ మైనింగ్ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా షావానీ చెప్పారు. నియంత్రణ లేని ఈ గనుల్లో భద్రతా చర్యల కొరత ఉందని, పని పరిస్థితులు సరిగా లేవన్నారు.
ఇదిలా ఉండగా.. గత ఏడాది డిసెంబర్ లో బలూచిస్థాన్ లోని డుకీ బొగ్గు క్షేత్రంలోని ఓ ప్రైవేటు గనిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు బొగ్గు గని కార్మికులు మృతి చెందారు. సెప్టెంబర్ లో సింధ్ లోని జంషోరోలో బొగ్గు గని కూలిన ఘటనలో ముగ్గురు కార్మికులు శిథిలాల కింద కూరుకుపోయారు. 2018 మేలో ఇదే ప్రాంతంలోని రెండు బొగ్గు గనుల్లో జరిగిన వరుస గ్యాస్ పేలుళ్లలో 23 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారు.