పిట్స్ బర్గ్: అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం పిట్స్ బర్గ్ నగరంలోని సినగోగ్ లోని ఓ వేడుకలో జరిగింది. 

ఓ ధార్మిక సంస్థలో బేబీకి పేరు పెట్టే వేడుకలో దుండగుడు కాల్పులు జరిపాడు. అమెరికాలోనే అత్యంత దారుణమైన సంఘటనగా దీన్ని అభివర్ణిస్తున్నారు. సాయుధుడిని స్థానికుడైన 46 ఏళ్ల రాబర్ట్ బోవర్స్ గా గుర్తించారు. దీన్ని ద్వేషపూరిత చర్యగా భావిస్తున్నారు. 

దుండగుడు యూదులందరూ మరణించాలని అరిచాడు. దుండగుడు పోలీసులపైకి కూడా కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేట్ క్రైమ్ కింద, ఇతర ఫెడరల్ చార్జెస్ కింద అతన్ని విచారించే అవకాశం ఉంది. దీని కింద అతనికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. 

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రతిస్పందించారు. యూదులకు తాము అండగా నిలుస్తామని చెప్పారు. సామూహిక హత్యలు అత్యంత కిరాతకమైనవని అన్నారు.