ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ కేంద్రంగా మంగళవారం 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం కారణంగా పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో 11 మంది మరణించారు. 

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ కేంద్రంగా మంగళవారం 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపం కారణంగా పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో 11 మంది మరణించారు. ఉత్తర భారతదేశంలో కూడా బలమైన ప్రకంపనలు వచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్‌ సమీపంలో 180 కిలోమీటర్ల లోతులో ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో మంగళవారం రాత్రి 10:17 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. 

పాకిస్తాన్‌లో కనీసం తొమ్మిది మంది మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోయాయి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా ఇద్దరు వ్యక్తులు మరణించారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.

పాకిస్తాన్‌లో లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, క్వెట్టా, పెషావర్, కోహట్, లక్కీ మార్వాట్‌లతో పాటు ఇతర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. గుజ్రాన్‌వాలా, గుజరాత్‌, సియాల్‌కోట్‌, కోట్‌ మోమిన్‌, మద్‌ రంఝా, చక్వాల్‌, కోహట్‌, గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాల్లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. పాకిస్థాన్‌లో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృతి చెందగా, 160 మందికి పైగా గాయపడ్డారని, అలాగే అనేక భవనాలు కూలిపోయాయని జియో న్యూస్ తెలిపింది. భూకంపం సంభవించిన సమయంలో రావల్పిండి మార్కెట్‌లో తొక్కిసలాట జరిగినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది. 

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ విపత్తు నిర్వహణ అధికారులను ఆదేశించారు. పాకిస్థాన్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీఐఎంఎస్)తో పాటు ఫెడరల్ గవర్నమెంట్ పాలిక్లినిక్‌లో అత్యవసర హెచ్చరిక జారీ చేసినట్లు జియో న్యూస్ నివేదించింది.

ఆఫ్ఘనిస్తాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ అమెర్‌ఖైల్ మాట్లాడుతూ.. భూకంపం నుంచి ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ఆరోగ్య సిబ్బందిని సిద్ధం చేయాలని అన్ని వైద్య కేంద్రాల అధిపతులను ఆదేశించినట్లు చెప్పారు.

ఇక, అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్, భారతదేశం మాత్రమే కాకుండా తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌లలో కూడా ప్రకంపనలు సంభవించాయి.