వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 100 మంది మృతి, 150 మందికి గాయాలు
ఇరాక్ లో ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఈవెంట్ హాల్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా చనిపోయారు. 150 మందికి పైగా గాయాల పాలయ్యారు. వివాహ వేడుకల సందర్భంగా పేల్చిన టపాసులే మంటలు చెలరేగడానికి కారణం అని తెలుస్తోంది.

ఉత్తర ఇరాక్ లో విషాదం చోటు చేసుకుంది. అల్ హమ్దానియా పట్టణంలోని ఓ ఈవెంట్ హాల్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించారు. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపిననట్టు ఇరాక్ ప్రెస్ ఏజెన్సీ ‘ఐఎన్ఏ’ నివేదించింది.
‘‘అల్-హమ్దానియాలోని ఒక వివాహ మండపంలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారని నినెవె ప్రావిన్స్ లోని ఆరోగ్య అధికారులు ప్రకటించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా దీనిని ధృవీకరించారు. ’’ అని ఐఎన్ఏ పేర్కొంది.
వివాహ వేడుకల సందర్భంగా బాణసంచా కాల్చడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక సివిల్ డిఫెన్స్ తెలిపింది. మంటలు చెలరేగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాక యంత్రాలు, అంబులెన్స్ లు అక్కడికి చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది అప్పటికే కాలిపోయిన భవనం శిథిలాలపైకి ఎక్కి ప్రాణాలతో బయటపడిన వారి కోసం గాలిస్తున్నట్టు ‘రాయిటర్స్’ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.45 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 7.45 గంటలకు) భవనంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో అక్కడ వందలాది మంది ప్రజలు వివాహ వేడుకకు హాజరయ్యారని ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.