షేర్ షా.. కెప్టెన్ విక్రమ్ బాత్రా: వెన్నుచూపని పోరాటంతో దాయాది దేశానికి వణుకు.. కార్గిల్ యుద్దంలో వీర మరణం..

శత్రువు ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో.. దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతుంటారు సైనికకులు. అలా కార్గిల్ యుద్దంలో వెన్ను చూపకుండా పోరాడి.. వీరమణం పొందినవారిలో కెప్టెన్ విక్రమ్ బాత్రా ఒకరు. 
 

The Story of Indian Army Legend captain Vikram Batra Who Died Fighting For India In Kargil

దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైనికులు విధులు నిర్వర్తిస్తుంటారు. శత్రువు ఎప్పుడు ఏ వైపు నుంచి దాడి చేస్తాడో తెలియని పరిస్థితుల్లో.. దేశం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతుంటారు. ఇలా 1999లో జరిగిన కార్గిల్ యుద్దంలో.. దాయాది పాకిస్తాన్‌పై భారత్ విజయాన్ని సాధించింది. ఇది భారత సైనికుల ధైర్యానికి ప్రతీక అనే చెప్పాలి. ఈ యుద్దంలో పలువురు భారత సైనికులు వీరమరణం పొందారు. వారిలో కెప్టెన్ విక్రమ్ బాత్రా ఒకరు. భారతదేశం స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అజాదీగా అమృత్ మ‌హోత్స‌వ్ ను జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా దేశానికి చేసిన సేవ, ఆయన జీవితం గురించి తెలుసుకుందాం.. 

విక్రమ్ బాత్రా.. 1974 సెప్టెంబర్ 9న హిమాచల్ ప్రదేశ్‌ పాలంపూర్ సమీపంలోని ఘగర్ గ్రామంలో జన్మించారు. అతనికి ఇద్దరు సోదరీమణులు, కవల సోదరుడు ఉన్నారు. విక్రమ్ బాత్ర గ్రాండ్ ఫాదర్ ఇండియన్ ఆర్మీలో సైనికునిగా పనిచేశారు. విక్రమ్.. స్కూల్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. మధ్య తరగతి నేపథ్యం వచ్చిన విక్రమ్‌కు క్రీడలపై ఆసక్తి ఉండేది. కరాటేలో గ్రీన్ బెల్ట్ సాధించిన విక్రమ్.. జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ ఆడారు. నార్త్ జోన్‌లో ఉత్తమ NCC క్యాడెట్ (ఎయిర్ వింగ్) అవార్డు పొందారు. చిన్నప్పటి నుంచి దేశభక్తిని నింపుకున్న విక్రమ్.. సైన్యం చేరాలనే ఆసక్తితో ఉండేవారు. 

The Story of Indian Army Legend captain Vikram Batra Who Died Fighting For India In Kargil

చండీఘర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పింజోర్ ఎయిర్‌ఫీల్డ్, ఫ్లయింగ్ క్లబ్‌లో NCC ఎయిర్ వింగ్ యూనిట్‌తో 40 రోజుల పారా ట్రూపింగ్ శిక్షణకు ఎంపికయ్యారు. 1994లో రిపబ్లిక్ డే పరేడ్‌కు ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఎంపికయ్యారు. ఆ రోజే ఆర్మీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 1995లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విక్రమ్.. కంబైన్డ్ డిఫెన్ష్ సర్వీసెస్‌ కోసం ప్రిపేర్ అయ్యారు. 1996లో ఆయన CDS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. లెఫ్టినెంట్‌గా ఇండియన్ ఆర్మీలో చేరారు.

విక్రమ్ బాత్రా మానేక్షా బెటాలియన్‌కు చెందిన జెస్సోర్ కంపెనీలో చేరారు. 13 JAK రైఫిల్స్‌లో నియమించబడ్డారు. మొదటి అసైన్‌మెంట్‌లో ఆయన జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్‌కి పోస్ట్ చేయబడ్డారు. ఏప్రిల్ 1999 నాటికి లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా యూనిట్ తన ఫీల్డ్ కాలాన్ని పూర్తి చేసింది. అక్కడ నుంచి శాంతి ప్రదేశానికి వెళ్లాల్సి ఉంది. అయితే 1999 మే నెల ప్రారంభంలో కార్గిల్ సెక్టార్‌లో పాకిస్తానీ బలగాలు పెద్ద ఎత్తున చొరబాట్లు గుర్తించబడ్డాయి.

కొద్ది రోజుల్లోనే కార్గిల్ వార్ ప్రారంభమైంది. కార్గిల్ యుద్దం ఆపరేషన్‌లో భాగంగా అత్యంత కష్టతరమైన, కీలకమైన శిఖరాలలో ఒకటైన శిఖరం 5140ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కెప్టెన్ విక్రమ్ బాత్రా డెల్టా కంపెనీకి ఆదేశాలు అందాయి. అక్కడ అప్పటికే శత్రు బలగాలు ఉన్నాయి. తనకు అందిన ఆదేశాలతో ముందుకు సాగిన  విక్రమ్.. షేర్ షా పేరుతో శత్రు బలగాలపై దాడికి సిద్దమయ్యారు. 17,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు తన సైన్యంతో కలిసి వెనుక నుంచి కొండను చేరుకోవాలని ప్లాన్ చేశారు. అయినప్పటికీ.. వారు పైభాగానికి చేరుకున్నప్పుడు పాకిస్తాన్ బలగాలు మెషిన్ గన్ కాల్పులు జరిపారు.

The Story of Indian Army Legend captain Vikram Batra Who Died Fighting For India In Kargil

అయితే ధైర్యంతో ముందుకు సాగిన విక్రమ్, అతని సేన.. కొండపైకి చేరుకుని మెషిన్ గన్ పోస్ట్‌ల వద్ద రెండు గ్రెనేడ్‌లను విసిరారు. విక్రమ్ ఒంటరిగా.. ముగ్గురు పాక్ సైనికులను హతమార్చాడు. అయితే కాల్పుల సమయంలో తీవ్రంగా గాయపడినప్పటికీ, తన సైనికులను తిరిగి సమూహపరచి మిషన్‌ను కొనసాగించారు. లక్ష్యాన్ని సాధించే విధంగా వారిలో ప్రోత్సహం నింపారు. చివరకు పాయింట్ 5140ను 1999 జూన్ 20వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. 

ఈ విషయాన్ని విక్రమ్ తెల్లవారుజామున 4.35 గంటలకు రేడియో సందేశం ద్వారా పంపారు. “చాణక్యా …ఇది షేర్షా రిపోర్టింగ్!! మేము పోస్ట్‌ను స్వాధీనం చేసుకున్నాము! యే దిల్ మాంగే మోర్” అని పేర్కొన్నారు. లెప్టినెంట్ విక్రమ్ బాత్ర.. ప్రదర్శించిన ధైర్యం ఇతరులలో కూడా ధైర్యం నింపింది. పాయింట్ 5140 స్వాధీనం చేసుకోవడం.. పాయింట్ 5100, పాయింట్ 4700, జంక్షన్ పీక్, 'త్రీ పింపుల్స్'లో ఇతర విజయాల వరుసకు మార్గం సుగమం చేసింది. ఈ విజయం తర్వాత.. లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా కెప్టెన్ హోదాకు పదోన్నతి పొందారు.

ఇక, 1998 జూలై 6వ తేదీన పాయింట్ 4875ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కెప్టెన్ విక్రమ్ బాత్రా దాడిని ప్రారంభించాడు.అసాధారణమైన ధైర్యసాహసాలతో కెప్టెన్ విక్రమ్.. శత్రు దళాలపై  దాడిని ప్రారంభించారు. పాయింట్ 4875ని తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత.. కొద్దిసేపటికే దాగి ఉన్న శత్రు సేనలు కాల్పులు జరిపాయి. దీంతో కెప్టెన్ విక్రమ్ గాయపడ్డారు. అయినప్పటికీ తన బాధ్యతలను కొనసాగించాడు. అయితే రక్తపు మడుగులో పడి ప్రాణాలతో పోరాడుతున్న తన టీమ్‌లోని యువ సైనికున్ని రక్షించే క్రమంలో.. శత్రు సైనికుడు దొంగచాటుగా జరిపిన కాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు.

ఆ తర్వాత కెప్టెన్ విక్రమ్ సేన.. లెడ్జ్ గుండా దాడి చేసి పాయింట్ 4875ని స్వాధీనం చేసుకున్నారు. ఈ పాయింట్‌ను.. కెప్టెన్ విక్రమ్ బాత్రా  అత్యున్నత త్యాగానికి నివాళిగా 'బాత్రా టాప్' అని పిలుస్తారు. కెప్టెన్ విక్రమ్ బాత్రా తన అత్యున్నత త్యాగానికి మరణానంతరం దేశ అత్యున్నత శౌర్య పురస్కారం ‘‘పరమ వీర చక్ర’’ గౌరవించింది. కెప్టెన్ విక్రమ్ బాత్రా త్యాగం భారత సైనిక చరిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక,  విక్రం జీవిత కథను బాలీవుడ్‌లో ‘‘షేర్‌షా’’ సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించారు. ఇందులో ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా చూపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios