భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అమరులైన వీరులెందరో ఉన్నారు. వారు సాధించి పెట్టిన స్వతంత్ర భారతావనిని కాపాడేందుకు మరెందో వీర సైనికులు నిత్యం సరిహద్దుల్లో కాపాలకాస్తున్నారు. శత్రుమూకలతో నిత్యం పోరాడుతున్నారు. ఇలాంటి పోరాటాల సమయంలో ఎందరో భరతమాత ముద్దు బిడ్డలు ఈ నేలకు అంకితమవుతున్నారు. మన దేశం ప్రస్తుతం అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ అమరుల త్యాగాలను స్మరించుకుందాం.
అది 1999 సంవత్సరం. జమ్మూ కాశ్మీర్ లోని లడక్ లోని కార్గిల్ ప్రాంతం. అక్కడంతా మంచు కొండలు. ఎముకలు కొరికే చలి. ఎటు చూసినా ఎత్తైన పర్వాతాలు. చాలా కఠిమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ భారత్ ను దొంగ దెబ్బ తీయాలని చూసింది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాలని ప్రయత్నించింది. ఇది మొదటగా జమ్మూ కాశ్మీర్ లోని తీవ్ర వాదులు చేస్తున్న పని మొదట అందరూ అనుకున్నారు. కానీ తరువాత పాకిస్తాన్ హస్తం ఉందని తెలిసింది.
పాకిస్తాన్ సేనలు, జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదులు ఒక వైపు, భారతసైన్యం ఒక వైపు. భీకరంగా యుద్ధం జరిగింది. ఎటు చూసినా కాల్పుల మోతలు. బుల్లెట్లు వర్షం కురుస్తున్నట్టు కురుస్తున్నాయి. అయినా భారత సైన్యం ఏమాత్రం తగ్గలేదు. పాకిస్తాన్ సైనికులను తరిమి తరిమి కొట్టాయి. దీంతో ఈ యుద్ధంలో భారత్ గెలిచింది. దీనిని కార్గిల్ వార్ అంటారు. ఈ యుద్ధం 1999 సంవత్సరం మే - జూలై మధ్య కాలంలో జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం విజయ్ దివాస్ ను జరపుకుంటాం.
ఈ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించడంలో ఎందరో భారత వీర జవాన్ల త్యాగం ఉంది. ఎంతో మంది సైనికులు భరతమాత సేవలో అసువులుబాసారు. అలాంటి గొప్ప దేశ భక్తుల్లో మన తెలుగుతేజం కూడా ఒకరు ఉన్నారు. ఆయన మేజర్ పద్మపాణి ఆచార్య. కార్గిల్ యుద్ధంలో ఆయన సేవలు కొలవలేనివి. బులెట్ల వర్షానికి కూడా వెనక్కితగ్గకుండా భీకరంగా యుద్దం చేస్తూ ముందుకే సాగిన ధైర్యం ఆయన సొంతం. పాకిస్తాన్ సేనలకు ఎదురు నిలబడి వీరోచితంగా పోరాటం చేసిన ఘనత ఆయనకు ఉంది. భారతదేశం స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అజాదీగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటోంది. ఈ సందర్భంలో ఆ వీరుడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మేజర్ పద్మపాణి ఆచార్య 1969 జూన్ 21వ తేదీన జన్మించారు. వాస్తవానికి ఆయన ఒడిశాలో పుట్టినప్పటికీ వారి కుటుంబం మొత్తం హైదరాబాద్ లోనే స్థిరపడింది. ఆయన తండ్రి జగన్నాథ్ ఆచార్య కూడా భారత దేశ సేవకు అంకితమైన వారే. ఆయన భారత వాయు సేనలో వింగ్ కమాండర్ గా తన సేవలు అందించి రిటైర్ అయ్యారు. పద్మపాణి ఆచార్య 1993లో భారత సైన్యంలో చేరారు. రాజ్‌పుతానా రైఫిల్స్ (2 రాజ్ రిఫ్) లో సెకండ్ లెఫ్టినెంట్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
కార్గిల్ యుద్ధంలో రాజ్ పుతానా రైఫిల్స్ కు ఆయన నేతృత్వం వహించారు. ఈ యుద్దం మొత్తం ఎత్తైన కొండల మధ్య జరిగింది. ఆ ప్రాంతలో ఉన్న టోలోలింగ్ పర్వతంపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారీ బంకర్ లను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి లెహ్ శ్రీనగర్ హైవేపైన బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ హైవేను ధ్వంసం చేస్తున్నారు. అయితే ఈ హైవే భారత సైన్యానికి చాలా కీలకం. భారత సైనికులకు అవసరమైన సామగ్రిని, ఆయుధాలను తరలించాలన్నా.. యుద్ధం ప్రాంతానికి సైనికులను చేరవేయాలని అనుకున్నా ఈ హైవేను ముఖ్య ఆధారం. అందుకే ముష్కరులు ఈ హైవేపై దాడి చేస్తున్నారు.
హైవేను ధ్వంసం కాకుండా చూడాలంటే బాంబుల వర్షాన్ని నిలువరించాలని భారతసైనికులకు అర్థం అయ్యింది. అప్పుడే భారత్ ఈ యుద్ధంలో గెలుస్తుంది. దీని కోసం టోలరింగ్ పర్వాతాన్ని భారత్ స్వాధీనపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఈ పర్వత్వాన్ని స్వాధీనం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. ఒకరకంగా పైనుంచి పాక్ మూకలు కురిపించే గుళ్ల వర్షానికి ఎదురు వెళ్లడమే అవుతుంది.
కానీ ఇలాంటి పరిస్థితికి కూడా మేజర్ పద్మపాణి ఆచార్య భయపడలేదు. మొక్కువోని దీక్షతో, అకుంఠిత దేశభక్తితో ఆయన తన రాజ్‌పుతానా కంపెనీ ని ముందుండి నడిపించాడు. తన రెజిమెంటులో అప్పటికే చాలా మంది సైనికులు మరణించినప్పటికీ తాను మాత్రం కించిత్తు భయం కూడా లేకుండా ముందుకు సాగాడు. తనతో పాటు తన ప్లాటూన్ లో కూడా నూతనోత్సవాహాన్ని సమరోత్సాహాన్ని నింపి కదనరంగంలో ముందుకు నడిపాడు. తానే స్వయంగా ఒక బంకర్ వద్దకు చేరుకొని శత్రువులపైకి పలుమార్లు గ్రెనైడ్లు విసిరాడు. ఈ క్రమంలో ముష్కరుల కాల్పుల్లో తన వొంట్లో సైతం చాలా తూటాలు దిగాయి. అయినప్పటికీ తాను మాత్రం ఆగలేదు. తన పోరును కొనసాగిస్తూ శత్రువులపైకి దూకాడు. ఒక పూర్తి రాత్రి పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో చివరకు రాజపుతాన రైఫిల్స్ టోలోలింగ్ పర్వతాన్ని తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే మేజర్ పద్మపాణి ఆచార్యను దేశ సేవలో అమరుడయ్యారు.
టోలరింగ్ పర్వతాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలోనే ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆచార్యను చికిత్స కోసం వెనక్కి తీసుకెళ్తామని రెజిమెంట్ లోని సైనికులు కోరినప్పటికీ ఆయన దానిని తిరస్కరించారు. ఆ గాయాలతోనే యుద్ధాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఆయన వీరమరణం పొందారు. ఆయన భారతదేశానికి చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. మరణానంతరం మేజర్ పద్మపాణి ఆచార్యకు సైనిక రెండో అత్యున్యత పురస్కారం అయిన మహావీర చక్ర అందజేసి గౌరవించింది.
ఆయన చనిపోవడానికి 10 రోజుల ముదు తన తండ్రికి ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం ఎంతో మందిని కన్నీళ్లు పెట్టించింది. ‘‘ ప్రియమైన నాన్న.. మీరు ప్రాణనష్టం గురించి బాధపడండి.. ఇది మా విధి నిర్వహణలో నియంత్రణ లేని అంశం. మేము మంచి కారణం కోసం చనిపోతున్నాం. పోరాటం అనేది మాకు జీవితకాలపు గౌరవం. నేను ఏ విషయం గురించి ఆలోచించలేనని అమ్మతో చెప్పండి. భారత భూమికి సేవ చేయడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది. మీరు చారు (భార్య చారులత)కు మహాభారతం నుంచి రోజుకు ఒక కథ చెప్పింది. దీంతో మీ మనవడు లేదా మనవరాలు మంచి విలువలను అలవర్చుకుంటారు’’ అని పేర్కొన్నారు.
