న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన సెమీ పైనల్ మ్యాచులో టీమిండియా ఓటమికి  మహేంద్రసింగ్‌ ధోనీయే కారణమని యువరాజ్‌ సింగ్‌ తండ్రి, భారత జట్టు మాజీ పేసర్‌ యోగ్‌రాజ్‌సింగ్‌ ఆరోపించారు. లీగ్‌ దశలో ఏడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా సెమీఫైనల్స్‌లో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి పాలైన విషయం తెలిసిందే. 

భారత్ ఓటమిపై ఓ క్రీడా ఛానెల్‌తో యోగరాజ్ సింగ్ ధోనీపై నిప్పులు చెరిగారు. డెత్‌ఓవర్లలో ధోనీ నెమ్మదిగా ఆడి రవీంద్రజడేజాపై ఒత్తిడి తెచ్చాడని ఆయన ఆరోపించారు.రవీంద్ర జడేజా కీలకమైన దశలో బ్యాటింగ్‌కు వచ్చి ఏమాత్రం భయం లేకుండా భారీ షాట్లు ఆడసాగాడని, మరోవైపు దోనీ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాఢని ఆయన అన్నారు. 

జడేజా 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధాటిగా ఆడాలని ధోనీ చెప్పాడని, అతడికన్నాముందు హార్దిక్‌ పాండ్యాని స్పిన్నర్లపై ఎదురుదాడి చేయాలని చెప్పాడని ఆయన ధోనీపై విరుచుకుపడ్డాడు. "మిస్టర్‌ ధోనీ నువ్వు ఇప్పటికే చాలా క్రికెట్‌ ఆడావు. ఎలా ఆడాలో ఎలా ఆడకూడదో నీకు తెలియదా? నీలాగే యువరాజ్‌ ఎప్పుడైనా వేరే ఆటగాళ్లకి అలా, ఇలా ఆడాలని చెప్పాడా" అని ఆయన ప్రశ్నించారు. 

మంచి బంతులు పడ్డప్పుడు కూడా ధోనీ సిక్సులు కొట్టలేకపోయాడని ఆయన అన్నాడు. ఆ స్థితిలో కూడా ధోనీకి ఆందోళన లేదా? ధోనీ ముందే ఔటైనా ఫలితంలో పెద్ద తేడా ఉండేది కాదని ఆయన అన్నారు.