నరాల తేగే ఉత్కంఠ మధ్య జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే కివీస్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇంగ్లాండ్‌ది అసలు గెలుపుకాదని.. అంపైర్లు నిబంధలకు విరుద్ధంగా ప్రవర్తించారంటూ కామెంట్ చేస్తున్నారు.

మరీ ముఖ్యంగా గప్టిల్ ఓవర్‌త్రో గురించే...  ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్ సైతం పెదవి విరిచారు. గప్టిల్ ఓవర్ త్రోకు ఇంగ్లాండ్‌కు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనని.. ఆరు కాదని సైమన్ టౌఫెల్ అన్నాడు.

మరో అంపైర్ హరిహరన్ స్పందిస్తూ... కుమార ధర్మసేన న్యూజిలాండ్ ప్రపంచకప్ ఆశలను చిదిమేశాడు.. ఆ ఓవర్ త్రోకు ఇవ్వాల్సింది 5 పరుగులేనని తెలిపాడు. ఈ సందర్భంగా ఐసీసీ నిబంధనను ఒక్కసారి గమనిస్తే.. నిబంధన 19.8 ఓవర్‌త్రో గురించి చెబుతోంది.

ఫీల్డర్ ఓవర్‌త్రోకు బంతి బౌండరీ దాటితే ఆ పరుగులను ప్రత్యర్ధి జట్టుకు ఇస్తారు. ఫీల్డర్ త్రో విసిరిన సమయంలో బ్యాట్స్‌మెన్ పూర్తి చేసిన పరుగులు.. చేస్తున్న పరుగును కూడా బౌండరీకి కలుపుతారు.

అయితే వరల్డ్‌కప్ సెమీఫైనల్‌లో స్టోక్స్, రషీద్ రెండో పరుగు కోసం ప్రయత్నిస్తుండగా.... గప్టిల్ త్రో విసిరే సమయానికి ఒకరినొకరు దాటలేదని టీవీ రీప్లయిలలో స్పష్టంగా కనిపించింది.

కానీ ఫీల్డ్ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్ మాత్రం ఇంగ్లాండ్‌కు ఆరు పరుగులిచ్చేశారు. ఇటువంటి పరిస్ధితితో టీవీ అంపైర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సిందని.. అంతేకానీ రెండో పరుగును ఎట్టి పరిస్ధితుల్లోనూ లెక్కలోకి తీసుకోకూడదని హరిహరన్ అభిప్రాయపడ్డాడు.

కాగా.. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండో పరుగు కోసం ప్రయత్నించగా..  డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తోన్న గప్టిల్ బంతిని అందుకుని వికెట్ల మీదకు విసిరాడు. అయితే ఆ త్రో స్టోక్స్‌ బ్యాట్‌కు తగలడంతో బంతి బౌండరీ దాటింది. దీంతో అంపైర్లు ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులివ్వడం ఇప్పుడు వివాదాస్పదమైంది.