మాంచెస్టర్: ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని అందరూ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా టాస్ గెలిచి ఇండియాపై న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకు విజయావకాశాలు ఉంటాయని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

న్యూజిలాండ్ పై టాస్ ఓడిపోయి ఫీల్డింగ్ కు దిగిన ఇండియాకు ఓటమి తప్పదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే, న్యూజిలాండ్ కు భారత బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బ తీయడం అంత సులభమేమీ కాదు. ఇండియా తుది జట్టు కూర్పులో తీసుకున్న జాగ్రత్త వల్ల ఆ విషయాన్ని చెప్పవచ్చు.

ఇండియా తుది జట్టు ఇలా ఉంది... రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధోనీ, దినేష్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చాహల్, బుమ్రా. ఈ జట్టును చూస్తే భువనేశ్వర్ కుమార్ వరకు కూడా ఇండియా బ్యాటింగ్ బలంగానే ఉంటుంది. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బ తీయడం న్యూజిలాండ్ జట్టుకు అంత సులభం కాదు. 

జట్టులో నిలకడగా రాణిస్తున్న రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలతో పాటు హిట్టర్లు హార్డిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఉన్నారు. రిషబ్ పంత్ నాలుగో స్థానంలో దాదాపుగా నిలదొక్కుకున్నట్లే. దానికితోడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజాలు కూడా వికెట్లను కాపాడుకుంటూ స్కోరును ముందుకు నడిపించగలరు. ఈ స్థితిలో టాస్ ఓడిపోయినంత మాత్రాన ఇండియా ఓడిపోతుందని చెప్పడానికి ఏ మాత్రం అవకాశం లేదు.