ప్రపంచకప్ లో భాగంగా బుధవారం భారత్- న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్ పోరులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం మంగళవారమే వెలువడాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడింది. అయితే... నిన్న రద్దు అయిన మ్యాచ్ ని బుధవారం కొనసాగిస్తున్నారు. కాగా.. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలుస్తుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మెక్ కల్లమ్ అభిప్రాయపడ్డారు. 250 టార్గెట్ ని టీం ఇండియా రీచ్ కావడం కష్టమని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు.

‘ఇరు జట్ల మధ్య జరిగే ధ్వైపాక్షిక సిరీస్‌ 250 పరుగుల లక్ష్యం సర్వసాధారణమే. కానీ విశ్వవేదికపై జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో మాత్రం కష్టమైనదే.’ అని పేర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్‌  మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులే చేసింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మెక్‌కల్లమ్‌ను ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ నిలదీశాడు. ‘ఇంకా 250 చేయలేదు కదా’ అని కామెంట్‌ చేశాడు. 

దీనికి మెక్‌కల్లమ్‌ స్పందించాడు. ‘ఈ ప్రపంచకప్‌లో రెండు జట్లు (భారత్‌, బంగ్లాదేశ్‌) మాత్రమే 250, అంతకన్నా ఎక్కువ పరుగుల లక్ష్యాలను చేధించి విజయాలు సాధించాయి. ఆ రెండు జట్లపై అప్పుడు  ఎలాంటి సెమీఫైనల్‌ ఒత్తిడి లేదు. చీర్స్‌ కేపీ, రేపు(బుధవారం) మా వాళ్లు ఇరగదీస్తారు’ అని బదులిచ్చాడు.