బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియాకు పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై రెండు మ్యాచుల నిషేధం విధించే అవకాశం ఉంది. మితిమీరి అపీల్ చేసినందుకు, ఫీల్డ్ అంపైర్లతో వాగ్వివాదానికి దిగినందుకు ఆయనపై ఈ వేటు పడే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్ పై విజయం సాధించిన టీమిండియా సెమీ ఫైనల్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచులో జరిగిన సంఘటన టీమిండియాను కష్టాల్లోకి నెట్టే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచు 11వ ఓవరులో మొహమ్మద్ షమీ వేసిన బంతి సౌమ్య సర్కార్ ప్యాడ్స్ కు తాకింది. షమీ ఎల్బీడబ్ల్యు అపీల్ చేశాడు. 

అయితే, అంపైర్ మార్యాస్ ఎరాస్మస్ షమీ అపీల్ తోసి పుచ్చాడు. దాంతో కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే, బంతి ఒకేసారి ప్యాడ్ కు, బ్యాట్ కు తగిలినట్లుందని చెప్పి ఎరాస్మస్ నిర్ణయంతో థర్డ్ అంపైర్ అలీం దార్ ఏకీభవించాడు. థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ స్క్రీన్ పై దృష్టి పెట్టలేదు.

భారత్ దాంతో రివ్యూను కోల్పోవడమే కాకుండా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. దాంతో సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ ఎరాస్మస్ తో వాదానికి దిగాడు. ఆ సమయంలో ఎంఎస్ ధోనీ లేడు. భారత అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ వివాదానికి కోహ్లీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిలో పడ్డాడు. అప్ధానిస్తాన్ పై జరిగిన మ్యాచులో అంపైర్ తో వాగ్వివాదానికి దిగినందుకు కోహ్లీకి జరిమానా పడింది. అతని మ్యాచులో ఫీజులో 25 శాతం కోత విధించారు. ఇప్పటికే కోహ్లీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రెండు డెర్మిట్ పాయింట్లు పొందాడు. 

రెండేళ్ల వ్యవధిలో నాలుగు పాయింట్లు వస్తే సస్పెన్షన్ పాయింట్లుగా మారి ఆటగాడిపై ఒక టెస్టు లేదా రెండు వన్డేలు, లేదా రెండు టీ20 మ్యాచుల నిషేధం పడుతుంది. అయితే, బంగ్లాదేశ్ జరిగిన మ్యాచులో అంపైర్ తో వాగ్వివాదానికి దిగినందుకు కోహ్లీకి శిక్ష పడకపోవచ్చు. శ్రీలంకతో జరిగే మ్యాచులో అదే పరిస్థితి ఎదురైతే మాత్రం నిషేధం తప్పదు.