న్యూఢిల్లీ: ప్రపంచ కప్ పోటీల్లో దారుణమైన ఆటను ప్రదర్శించిన షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకున్నారు. బంగ్లాదేశ్ పై విజయం సాధించినప్పటికీ పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుకోలేని స్థితిలో ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే తన రిటైర్మెంట్ గురించి షోయబ్ మాలిక్ చెప్పాడు. 

ట్విట్టర్ వేదికగా షోయబ్ మాలిక తన రిటైర్మెంట్ గురించి శుక్రవారం నాడు చెప్పాడు. నేడు తాను అంతర్జాతీయ వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నానని షోయబ్ మాలిక్ చెప్పాడు. తనతో ఆడిన ఆటగాళ్లకు, తనకు శిక్షణ ఇచ్చిన కోచ్ లకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్ కు ఆయన ధన్యవాదాలు తెలిపాడు, 

 

షోయబ్ మాలిక్ గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తున్న వీడియోను క్రికెట్ ప్రపంచ కప్ అధికారిక ట్విట్టర్ కూడా షేర్ చేసింది. షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మాంచెస్టర్ లో భారత్ పై ఆడాడు. ఈ మ్యాచులో పాకిస్తాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఈ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లే ఆడిన అతను 8, 0, 0 పరుగులు చేశాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్‌ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు.