లండన్: ప్రపంచ కప్ పోటీలు కీలకమైన దశకు చేరుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. షాన్ మార్ష్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో హ్యాండ్స్ కోంబ్ జట్టులో చేరుతున్నాడు. ఈ విషయాన్ని ఐసిసి ప్రకటించింది. 
పంచకప్‌లో భాగంగా గాయపడిన షాన్‌మార్ష్‌ స్థానాన్ని పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌తో భర్తీ చేస్తాడని, ఆస్ట్రేలియా తదుపరి మ్యాచ్‌లలో అతడు ఆడే విషయాన్ని ఐసీసీ ధ్రువీకరించిందని గురువారం ఓ ప్రకటన విడుదలైంది. 

ప్రపంచకప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచిన ఆసీస్‌ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. శనివారం జరిగే ఈ మ్యాచ్‌ కోసం ఓల్డ్‌ ట్రఫార్డ్‌లో నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్న షాన్‌ మార్ష్‌ గాయపడ్డాడు. పాట్‌ కమిన్స్‌ బంతులను ఎదుర్కొనే క్రమంలో అతడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. దీంతో సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది.

కాగా, ఆల్‌రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ కుడి ముంజేతికి కూడా గాయమైంది. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో అతడు గాయపడ్డాడు. శనివారం జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వస్తాడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ అన్నాడు. పీటర్‌పై నమ్మకం ఉందని, మిడిల్‌ ఆర్డర్‌లో రాణించగలడనే భావిస్తున్నామని లాంగర్ అన్నాడు.

ఇండియా, యూఏఈ టూర్లలో పీటర్ గొప్ప ప్రదర్శన కనబరిచాడనిఆయన గుర్తు చేశాడు. హ్యాండ్స్‌కోంబ్‌ ఆస్ట్రేలియా తరఫున ఇప్పటివరకు 21 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.