లండన్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మందకొడి బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువతున్న తరుణంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ మాత్రం మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ పోటీలు ముగిసిన వెంటనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించవచ్చుననే వార్తలు కూడా వస్తున్నాయి. 

ధోనీ మరో రెండేళ్లు ఆడగలడని లసిత్ మలింగ అన్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫనిషర్ ఇప్పటికీ ధోనీయేనని అన్నాడు. ధోనీ లోటును తీర్చడం కష్టమని, ధోనీ చేసి యువ క్రీడాకారులు నేర్చుకోవాలని అన్నాడు. 

ముంబై ఇండియన్స్ టీమ్ మేట్ జస్ ప్రీర్ బుమ్రాపై మలింగ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా తనపై తనకు నమ్మకం పెట్టుకుంటాడని, భారీ వేదికలపై ఆడే సమయంలో అది ఒత్తిడిని తట్టుకోవడానికి పనికి వస్తుందని ఆయన అన్నాడు. 

ఒత్తిడి అంటే ఏమిటి, ఒత్తిడి ఎదుర్కుంటున్నావంటే నీ నైపుణ్యం మీద నీకు నమ్మకం లేకపోవడమని మలింగ అన్నాడు. నీకు నీ మీద నమ్మకం ఉంటే ఒత్తిడి అనేది ఉండదని అన్నాడు. అంతా నైపుణ్యం, కచ్చితత్వాలకు సంబంధించిందేనని, కచ్చితత్వం ఉంటే నీవు ఉద్దేశించిందేమిటో నువ్వు సాధించగలుగుతావని అన్నాడు. అది బుమ్రాకు ఉందని అన్నాడు. 

ఎవరైనా యార్కర్లు, స్లో బాల్స్, గుడ్ లెన్త్ బాల్స్ వేయగలరని, కానీ కచ్చితత్వం ఉండాలని, ఎన్నిసార్లు ఒకే చోటు బంతిని వేయగలవు... అదే ఆటను విశ్లేషించడానికి పనికి వస్తుందని అన్నాడు. 

బుమ్రాను 2013 నుంచి చూస్తున్నానని, నేర్చుకోవాలనే తపన ఉందని, తొందరగా నేర్చుకుంటాడని, నేర్చుకోవాలనే తపనే అత్యంత ముఖ్యమైందని, బుమ్రా అతి తక్కువ కాలంలో తన సత్తా చూపగలిగాడని మలింగ అన్నాడు. 

2011 ప్రపంచ కప్ పోటీల్లో ధోనీ సాధించినదాన్ని టీమిండియా పునరావృతం చేస్తుందని మలింగ అన్నాడు. సత్తా ఉంది కాబట్టి ఆ జట్టు అది సాధించగలదని అన్నాడు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్నారని అన్నాడు. రోహిత్ శర్మ ఎంత అద్భుతంగా ఆడుతున్నారో చూస్తూనే ఉన్నారని అన్నాడు. విరాట్ కోహ్లీ కూడా బాగా ఆడుతున్నాడని, అతను సెమీ ఫైనల్ లేదా ఫైనల్ లో సెంచరీ సాధిస్తాడని మలింగ అన్నాడు. మ్యాచ్ ను ఒంటి చేతి మీద గెలిపించగలిగే ఆటగాళ్లు ఇండియాకు చాలా మంది ఉన్నారని, అదే పనికి వస్తోందని అన్నాడు.

తన భవిష్యత్తుపై కూడా మలింగ మాట్లాడాడు. తాను బోర్డు సభ్యులను కలుస్తానని, వారు తనను నుంచి కోరుకుంటున్నారో అడుగుతానని, వారి నుంచి వచ్చే సమాధానాన్ని అనుసరించి ప్లాన్ చేసుకుంటానని అన్నాడు.