లండన్: తమ జట్టు అన్ని విభాగాల్లో రాణించడం పట్ల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టలేని ఆనందంతో ఉన్నట్లు కనిపించాడు. ప్రస్తుతం తమ జట్టు అత్యద్భుతమైందని ఆయన అన్నాడు. శ్రీలంకతో విజయం తర్వాత ఆయన శనివారం మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. 

నిజాయితీగా చెప్పాలంటే తాము ఈ విధమైన ఆటను ఊహించలేదని, ఈ రకమైన స్కోరింగ్ లైన్ తో తాము సెమీస్ కు చేరుతామని అనుకోలేదని విరాట్ కోహ్లీ అన్నారు. తాము నిలకడైన ఆటను ప్రదర్శించడమే కాకుండా కఠిన శ్రమ చేశామని అన్నాడు. తమ జట్టు పట్ల ఆనందంగానూ గర్వంగానూ ఉన్నానని చెప్పాడు. 

సెమీ ఫైనల్ లో ఏ జట్టుతో ఆడాలని అనుకుంటున్నావని ప్రశ్నిస్తే... తమ ప్రత్యర్థి ఎవరనేది తమకు ముఖ్యం కాదని, తాము బాగా ఆడకపోతే ఏ జట్టయినా తమను ఓడించవచ్చునని, తాము బాగా ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అన్నాడు. 

జట్టుపైనే తమ దృష్టి ఉంటుందని, తమ నైపుణ్యాల పట్ల, బలం మీద తమకు విశ్వాసం ఉందని ఆయన అన్నాడు. తాము ఏ జట్టు మీద ఆడుతున్నామనేది తమకు ముఖ్యం కాదని, మంచి క్రికెట్ ఆడుతామని, దానివల్ల ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని అన్నాడు. 

దాదాపుగా ప్రతిదీ సెట్ అయిందని, ఒక్క డైమన్షన్ వైపు మాత్రమే తాము చూడడం లేదని, తాము ఏం సాధించదలుచుకున్నామో దాన్ని సాధించడానికి అనువుగా వెసులుబాటుకు జట్టులో అవకాశం ఉందని ఆయన అన్నారు. 

శ్రీలంకను ఓడించిన ఇండియా సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కోనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తన సత్తాను చాటింది.