ఢాకా: ఈ ప్రపంచకప్‌లో తాము దేశ క్రికెట్ అభిమానులను అసంతృప్తికి గురిచేశామని, వారి అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యామని, అందుకు చింతిస్తున్నామని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫె మొర్తాజా అన్నాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యామని, తద్వారా అభిమానులను, మద్దతుదారులను నిరాశకు గురిచేశామని ఆయన అన్నాడు. 

ప్రపంచకప్‌లో ఓటమికి తనదే బాధ్యత అని మొర్తాజా అన్నాడు. ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించకుండానే బంగ్లాదేశ్‌ జట్టు వెనుదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ నుంచి ఢాకా చేరుకున్న తర్వాతమొర్తాజా మీడియాతో మాట్లాడాడు.

మొత్తంగా చూసుకుంటే తమ ఆటతీరు సానుకూలంగానే ఉందని, కానీ తమ మీద ఉంచిన అంచనాలను అందుకోలేకపోయామని అన్నాడు. కొన్ని ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చి ఉంటే తాముసెమీఫైనల్‌కు చేరేవాళ్లమని అన్నాడు. ఒకవేళ చివరి మ్యాచ్‌లో గెలిచినా.. టాప్‌ ఐదో స్థానంలో ఉండేవాళ్లమని మొర్తాజా అన్నాడు. 

తాము సెమీస్‌కు రావాలని ప్రేక్షకులంతా కోరుకున్నారని, దురుదృష్టవశాత్తు అది జరగలేదని ఆయన అన్నాడు.  లీగ్‌ దశలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, అఫ్గానిస్థాన్‌ జట్లను ఓడించిన బంగ్లాదేశ్ పలు టాప్‌ జట్లతో గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

భారత్‌తో మ్యాచ్‌ వరకు తమకు సెమీస్‌ అవకాశాలు సజీవంగా నిలిచాయని ఆయన చెప్పాడు.  షకీబుల్‌ హసన్‌, ముష్ఫిక్‌ రహీం తప్ప మిగతా ఆటగాళ్లు నిలకడగా రాణించకపోవడం తమ అవకాశాలను దెబ్బతీసిందని అన్నాడు.ఈ వరల్డ్‌కప్‌లో షకీబుల్‌, ముష్ఫిక్‌తోపాటు ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ సైఫుద్దీన్‌ కూడా అద్భుతంగా రాణించాడని  ఆయన అన్నాడు.