కాబూల్‌: ప్రపంచకప్‌ టోర్నీకి అనూహ్యంగా దూరమైన అఫ్గానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ అఫ్తాబ్‌ ఆలమ్‌పై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా దేశవాళీ టోర్నీలకూ దూరంగా ఉండాలని అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అతన్ని  ఆదేశించింది.. 

ప్రపంచకప్‌లో జూన్‌ 22న సౌతాంప్టన్‌లో భారత్‌తో ఆడిన మ్యాచే అతనికి చివరిది. ఈ మ్యాచ్‌ తర్వాత సౌతాంప్టన్‌ హోటల్‌లో ఒక మహిళతో అఫ్తాబ్‌ తప్పుగా ప్రవర్తించినట్లు తేలింది. దీంతో జూన్‌ 23న ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌ సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

అతను కావాలని సమావేశానికి హాజరు కాకపోవడంతో కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌ తర్వాతి రెండు మ్యాచ్‌ల నుంచి అఫ్తాబ్‌ను తప్పించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్తాబ్‌ ప్రపంచకప్‌ టోర్నీకి దూరమవుతున్నాడని ఆయన ప్రకటించారు. 

ఆ తర్వాత ఈ ఘటనపై అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి గత వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 26 ఏళ్ల అఫ్తాబ్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.