విలేకరులపై ఆప్ఘనిస్థాన్ కెప్టెన్ గుల్బదిన్ మండిపడ్డాడు. అడిగిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడిగి విసిగిస్తే... తాను అక్కడి నుంచి వెళ్లిపోతానని మీడియా వాళ్లను బెదిరించాడు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి ముందు ఆప్ఘాన్ ఆటగాళ్లు మాంచెస్టర్‌లోని లివర్‌పూల్ రోడ్డులో ఉన్న అక్బర్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే, రెస్టారెంట్‌లో పలువురు యువకులు ఆప్ఘన్ క్రికెటర్ల వీడియోని తీసేందుకు ప్రయత్నించగా వారు వద్దని వారించారు. ఈ క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

దీంతో.. ఈ సంఘటన వైరల్ గా మారింది. క్రికెటర్లు వాళ్లలో వాళ్లే కొట్టుకున్నారంటూ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ ఘటనకు సంబంధించి కెప్టెన్ గుల్బదిన్ ని మీడియా ప్రశ్నించగా..ఈ విషయంపై తనవద్ద సమాచారం లేదని చెప్పాడు. "నాకు తెలియదు. దీని గురించి తెలుసుకోవాలంటే మా సెక్యూరిటీ ఆఫీసర్‌ను అడగండి. నాకు గానీ, జట్టుకు కానీ ఇదేమంత పెద్ద సమస్య కాదు" అని అన్నాడు.

తర్వాత న్యూజిలాండ్ తో మ్యాచ్ ఓడిపోయిన అనంతరం మరోసారి గుల్బదిన్ మీడియా ముందుకు రాగా... మళ్లీ అదే ప్రశ్న పునరావృతం అయ్యింది.  అయితే.. ఈసారి మాత్రం కెప్టెన్ గుల్బదిన్ సీరియస్ అయ్యాడు. ఇదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగితే... తాను అక్కడి నుంచి వెళ్లిపోతానని కాస్త గట్టిగానే బెదిరించాడు.  కాగా ఈ విషయంపై అధికారులు స్పందించారు. హోటల్ లో ఘర్షణ జరిగిన మాట వాస్తవేమనని.. కాకపోతే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ఎవరినీ అరెస్టు చేయలేదని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు.