దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించిన టీమిండియా... పాక్‌ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉంది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీకి బదులు తీర్చుకోవడంతో పాటు ప్రపంచకప్‌లో పాక్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత్‌ దానిని నిలబెట్టుకోవాలని చూస్తోంది. మరోవైపు ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాకిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయకూడదని భారత్ వ్యూహాలు రచిస్తోంది.

దీనిలో భాగంగా తుదిజట్టులో ఇద్దరు స్పిన్నర్లకు బదులుగా ఒకరితోనే బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. దీంతో కుల్‌దీప్‌కు బదులు షమీని తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ పాక్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.