బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్ ల్లో టీమిండియా ఏ జట్టుతో తలపడాల్సి ఉంటుందనేది ఇంకా తేలాల్సే ఉంది. ఇప్పటి వరకు భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండు సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ కూడా సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది. 

సెమీ ఫైనల్ లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టును ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలువగా, ఇండియా రెండో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్ ను ఓడించిన ఇంగ్లాండు మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇండియాకు, ఇంగ్లాండుకు మధ్య సెమీ ఫైనల్ జరుగుతుంది. కానీ, ఇంకా కొన్ని మ్యాచులు మిగిలి ఉన్నందున ఈ సమీకరణాలు మారే అవకాశం ఉంది. 

ఆస్ట్రేలియా, భారత్ స్థానాలు తర్వాతి మ్యాచుల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. తర్వాత మ్యాచుల్లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో, ఇండియా శ్రీలంకతో తలపడనున్నాయి. దక్షిణాప్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే సెమీ ఫైనల్ అవకాశాలను చేజార్చుకున్నాయి. 

దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచులో ఆస్ట్రేలియా పరాజయం పాలై, ఇండియా శ్రీలంకపై గెలిస్తే కోహ్లీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది. అప్పుడు ఇండియా సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచులో ఆస్ట్రేలియా విజయం సాధించి, శ్రీలంకపై భారత్ గెలిచినా ఇండియా రెండో స్థానానికే పరిమితమవుతుంది. అప్పుడు ఇంగ్లాండుతో ఇండియా సెమీ ఫైనల్ ఉంటుంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి, శ్రీలంకపై భారత్ విజయం సాధిస్తే మెరుగైన రన్ రేట్ తో భారత్ అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. 

అయితే, ఇండియా ఎలా చూసినా ఇంగ్లాండును గానీ న్యూజిలాండ్ ను సెమీ ఫైనల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇంగ్లాండుపై ఇండియా ఓడిపోగా, న్యూజిలాండ్ పై మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ రెండింటిలో ఏ జట్టు అయినా ఫైనల్ కు చేరుకోవాలంటే ఇండియా తీవ్రంగానే పోరాటం చేయాల్సి ఉంటుంది.