ముంబై: ప్రపంచ కప్ టోర్నీ సైమీ ఫైనల్ నుంచే ఇండియా ఇంటి దారి పట్టిన ప్రభావం అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ పై పడే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ కోచ్ అయిన సంజయ్ బంగర్ పనితీరును బిసిసిఐ విశ్లేషిస్తోంది. ఆయనను తప్పించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. 

ప్రపంచ కప్ పోటీలతో కాంట్రాక్టు ముగిసినప్పటికీ చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవికాలాన్ని 45 రోజుల పాటు పొడగించారు. సరిగా తన బాధ్యతలు నిర్వహించలేదనే ఉద్దేశంతో సంజయ్ బంగర్ పనితీరును బిసిసిఐ విశ్లేషిస్తోంది. 

బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నేతృత్వంలో ఏడాది కాలంగా ఇండియా బౌలింగ్ విభాగం విశేషంగా బాగుపడిందని, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ నేతృత్వంలో ఫీల్డింగ్ విభాగం కూడా బాగుపడిందని బిసిసిఐ మేనేజ్ మెంట్ భావిస్తోంది. బ్యాటింగ్ విభాగం మాత్రం మెరుగు కాలేదని అభిప్రాయపడుతోంది. ప్రత్యేకంగా నెంబర్ 4 స్థానంలో స్థిరమైన అటగాడిని కనిపెట్టడంలో విఫలమైనట్లు భావిస్తున్నారు. 

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను తరుచుగా మారుస్తుండడం వల్ల బ్యాటింగ్ విభాగం మెరుగు పడడం లేదని, ప్రపంచ కప్ లోనే కాదు ఇతర సిరీస్ ల్లో కూడా ఆ వైఫల్యం కనిపిస్తోందని బిసిసిఐ వర్గాలంటున్నాయి. బ్యాటింగ్ లోపాలకు సంజయ్ బంగర్ పరిష్కారాలు కనిపెట్టి, సరైన సూచనలు చేయలేకపోయారని అంటున్నారు. 

విజయ్ శంకర్ ఫిట్నెస్ పై సంజయ్ బంగర్ చేసిన ప్రకటనను బిసిసిఐ యాజమాన్యం తీవ్రంగా తీసుకుంటోంది. ప్రతి ఆటగాడు అందుబాటులో ఉంటాడని బంగర్ చెప్పిన మర్నాడే విజయ శంకర్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్షణ్ లతో కూడిన క్రికెట్ అడ్వయిజరీ కమీటి (సిఎసి)ని అసలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జట్టు మేనేజర్ సునీల్ సుబ్రమణ్యం ప్రవర్తన కూడా అందరికీ ఆశ్చర్యానికి గురి చేసినట్లు చెబుతున్నారు.