లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఒకే ప్రపంచకప్‌లో 400 కన్నా ఎక్కువ పరుగులు చేయడంతోపాటు పది వికెట్లు కూడా తీసిన తొలి క్రికెటర్ గా షకీబ్‌ రికార్డు నమోదు చేశాడు. 

దానికితోడు ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా కూడా షకీబ్ ఘనత సాధించాడదు. ఈ రికార్డు ఇప్పటి వరకు యువరాజ్ సింగ్ పేరు మీద ఉంది. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అర్థ సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు. 

అఫ్గానిస్తాన్ పై విజయంతో బంగ్లాదేశ్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా టాప్‌–5లోకి దూసుకువచ్చింది. తద్వారా సెమీస్‌ రేసులో నిలిచింది. సోమవారం అప్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 

తమ తదుపరి మ్యాచ్‌లను బంగ్లాదేశ్ మాజీ చాంపియన్స్‌ భారత్‌, పాకిస్తాన్‌లతో ఆడనుంది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ 3 గెలిచి 7 పాయింట్లతో 5 స్థానంలో నిలిచింది. బంగ్లా తర్వాతి స్థానాల్లో మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు ఉన్నాయి.