కరాచీ: ప్రస్తుత ప్రపంచ కప్ పోటీల్లో తమ ప్రదర్శన మరీ అంత చెత్తగా ఏమీ  లేదని పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ అన్నాడు. తమ జట్టు సెమీ ఫైనల్‌ రేసులో నిలవలేకపోయినా ఆకట్టుకుందనే విషయం అందరికీ తెలసునని అన్నాడు. 

భారత్‌పై ఓటమి తర్వాత తాము తిరిగి పుంజుకున్నామని, ఆ తర్వాత తమ ఆట తీరు అద్భుతంగా ఉందని సర్ఫరాజ్ అన్నాడు. తన జట్టు సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాము సెమీ ఫైనల్‌కు చేరుకోలేకపోయినందుకు ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.

వరల్డ్‌కప్‌ను లీగ్‌ దశలోనే పాకిస్తాన్ జట్టు ముగించి స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కరాచీలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అతను మాట్లాడాడు. తమ ప్రదర్శన చెత్తగా ఉందని ఎవరైనా అభిప్రాయపడితే అది తప్పు అని అన్నాడు. తాము భారత్‌పై ఓటమి చెందిన తర్వాత పూర్తి స్థాయి ప్రదర్శనతో వరుస విజయాలు సాధించామని అన్నాడు. అయితే అదృష్టం కలిసి రాక టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చిందని అన్నాడు. 

అటువంటప్పుడు తాము ఎవరికి క్షమాపణలు చెప్పాలని సర్ఫరాజ్ అడిగాడు.  తమ శాయశక్తులా ప్రయత్నించామని అన్నాడు. తాము 2 నుంచి 4 పాయింట్లతో స్వదేశానికి రాలేదని. 11 పాయింట్లు సాధించామని చెప్పాడు. అందువల్ల తమ ప్రదర్శన బాగుందనే విషయం అంతా అంగీకరించాలని అన్నాడు.