బర్మింగ్ హామ్: టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాట మార్చాడు. అఫ్గానిస్తాన్ పై ధోనీ జిడ్డులాగా ఆడాడని విమర్శించిన ఆయన తాజాగా మెచ్చుకున్నాడు. ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచులో ధోనీ చేసిన బ్యాటింగ్ ను టెండూల్కర్ అభినందించాడు. 

ధోనీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కూడా కురిపించాడు. ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ జిడ్డు బ్యాటింగ్‌ చేయడంతో తాను తీవ్ర నిరాశ చెందానని ఇటీవల అన్నాడు. అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ ధోనీకి అండగా నిలిచాడు. 

బంగ్లాపై జరిగిన మ్యాచ్‌లో ధోనీ చేసిన 35 పరుగులు టీమిండియాకు ఉపయోగపడ్డాయని సచిన్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ బంగ్లాదేశ్‌పై 28 పరుగులతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ధోనీ ఎప్పుడు కూడా వ్యక్తిగత రికార్డుల గురించి కాకుండా జట్టు గురించే ఎక్కువగా ఆలోచిస్తాడని సచిన్‌ అన్నాడు. ధోనీ ఇన్నింగ్స్‌ ముఖ్యమైందని, జట్టుకు అవసరమైనదే ధోనీ చేశాడని అన్నాడు. 50 ఓవర్ల దాకా ధోనీ ఆడివుంటే చివరివరకు తన సహచరులకు అండగా ఉండేవాడని టెండూల్కర్ అన్నాడు. 

ధోనీ మైదానంలో ఉన్నంతవరకు జట్టు కోసమే ఆడాడని, అతను జట్టుకే మొదటి ప్రాధాన్యమిస్తాడని జట్టు అవసరాలకు ఏదైతే కావాలో దానిని ధోని పర్ఫెక్ట్‌గా చేశాడని సచిన్‌ ప్రశంసించాడు.